Tuesday, May 14, 2024

రాష్ట్రంలోనైనా, రాష్ట్రపతి ఎన్నికల్లోనైనా ఒకే విధానం.. సామాజిక న్యాయమే జగన్‌ విధానం : వైఎస్సార్సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోనైనా – రాష్ట్రపతి ఎన్నికల్లోనైనా సామాజిక న్యాయమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానమని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో వైసీపీ ఎంపీలు డాక్టర్‌ వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏ ప్రభుత్వమూ మేలు చేయలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలో గతంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన సంపదలో వాటా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం కేటాయించేలా, పార్లమెంటులో ప్రైవేటు బిల్లుపై సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆ బిల్లు ఆమోదం పొందేలా తాము గట్టిగా ప్రయత్నిస్తామని తెలిపారు. 25 మంది మంత్రుల్లో 10 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీకి, ఒక మైనారిటీకి పదవులిచ్చారని తెలిపారు. 56 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పాలక మండళ్లలో కూడా తగిన ప్రాతినిథ్యం కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రామ వాలంటీర్లలో దాదాపు 90 శాతం బలహీనవర్గాలకు ఇచ్చారన్న ఆయన, ఇవన్నీ చూసి ఇతర రాష్ట్రాల వారు విస్మయం వ్యక్తం చేశారన్నారు.రాష్ట్రంలో బీసీ సబ్‌ ప్లాన్‌ పెట్టి వారికి ప్రత్యేకంగా నిధులు రూ.30 వేల కోట్లు కేటాయించగా, చివరకు కేంద్రం అందుకు ఇచ్చింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమేనని తెలిపారు. అందులో ఒక్కో రాష్ట్రానికి రూ.50 కోట్లు కూడా రావని, ఆ నిధులతో ఒక్క పని కూడా జరగదని అన్నారు. ఆదివాసీ, మహిళ కాబట్టి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ను బలపరుస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇస్తూ ధన్‌కర్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారని, అందుకే ఆయనకు తమ పార్టీ మద్దతిస్తోందని కృష్ణయ్య వివరించారు.

అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ…. బీసీలకు ప్రాధాన్యమిస్తూ జగన్ తమకు అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీలు కూడా పార్లమెంటులో గళం వినిపించే అవకాశం లభించిందన్నారు. బీసీలంటే వెనుకబడిన వారు కాదన్న ఆయన, వారు బ్యాక్‌బోన్‌ వంటి వారని సీఎం జగన్ రుజువు చేశారన్నారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం, అన్ని పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని నిర్ణయించి చట్టం చేశారని మస్తాన్ రావు వెల్లడించారు. చట్టసభల్లో బీసీలకు ఇంకా ప్రాతినిథ్యం లభించేలా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. బీసీ ఉప ప్రణాళిక కింద ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.18,500 కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఏటా రూ.15 వేల కోట్లు ఇస్తామన్న జగన్ ఇప్పటికే రూ.45 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశారన్న ఎంపీ, అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

దేశంలో తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళకు దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి దక్కడంపై ఎంపీ గొడ్డేటి మాధవి సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి, చనిపోతే ఆయనను గుర్తు పెట్టుకున్న జగన్ తనను ఎంపీని చేశారని గుర్తు చేశారు. ఇంకా తమ గిరిజన ప్రాంతంలో మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు, ట్రైబల్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇలా అనేక రకాలుగా ముఖ్యమంత్రి తమకు ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె వివరించారు.

గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎంపిక చేయడం, ఆమెకు మద్దతు ఇవ్వాలన్న సీఎం జగన్‌ నిర్ణయం హర్షణీయమని ఎంపీ డాక్టర్ సత్యవతి చెప్పారు. ఇది దేశ ప్రజలకు గొప్ప సందేశాన్నిస్తోందన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కన్న కలలను జగన్‌ సాకారం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement