Sunday, May 5, 2024

ఏపీకి అలాట్‌ అయిన అధికారులపై విచారణ షురూ.. తుది తీర్పు త్వరలో..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏపీకి అలాట్‌ అయినా ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న ఆలిండియా సర్వీస్‌ క్యాడర్‌ అధికారుల అంశంపై తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన 12 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు చెందిన పిటిషన్‌పై హైకోర్టు తుది విచారణ జరుపుతోంది. సోమవారం హైకోర్టు విచారణను చేపట్టింది. ఇదే అంశంపై గతంలో అప్పటి సీఎస్‌ సోమేష్‌కుమార్‌ విషయంలో ఇచ్చిన తీర్పునే వీరందరికీ వర్తింపజేయాలని ఎన్నికల కమిషన్‌ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో తుది తీర్పు నేపథ్యంలో జరుగుతున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు అలాట్‌ అయినా తెలంగాణలోనే దీర్ఘకాలంగా కొనసాగుతున్న పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వివాదాలను తేల్చేయాలని హైకోర్టు భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తరఫున డీవోపీటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు డిసెంబరు 4 నుంచి విచారణ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు స్పష్టం చేసింది.

- Advertisement -

మొత్తం 13 మంది అధికారులు ఏపీకి అలాట్‌ అయినా తెలంగాణలోనే కొనసాగుతున్నారని, క్యాట్‌ (సెంట్రల్‌ అడ్మినిస్ట్రేట్రివ్‌ ట్రిబ్యునల్‌) నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని దాదాపు పదేండ్లుగా పనిచేస్తున్నారని ఆ పిటిషన్‌లో డీవోపీటీ ఆరోపించింది. జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఇరు తరపున వాదనలు జరిగాయి.

ఏపీ కేడర్‌గా ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఆ రాష్ట్రానికి బదిలీ చేయాల్సిందేనని, గతంలోనే సోమేశ్‌ కుమార్‌ బదిలీపై హైకోర్టు ఉత్తర్వులను వెలువరించిందని, మిగిలినవారి విషయంలోనూ ఇదే తరహా సారూప్యత ఉన్నందున వీరికి కూడా అవే ఉత్తర్వులను వర్తింపజేయాలని డీవోపీటీ తరఫు న్యాయవాది వాదించారు. కానీ సోమేశ్‌ కుమార్‌ విషయంలో వెలువరించిన తీర్పు తమకు వర్తించదని అధికారుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు బెంచ్‌ సైతం కొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్నదని, అఖిల భారత సర్వీసు అధికారులను (ఏఐఎస్‌) ఏపీకి కేటాయించి అంతే కాలమైందని వ్యాఖ్యానించారు.

పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ అధికారులు డీవోపీటీకి వారి విజ్ఞప్తి, అభ్యంతరాలు, ఆభ్యర్థలను చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 13 మంది అధికారుల్లో పలువురు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నారని వారి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చివరకు ఒక్కో అధికారి తరఫున వ్యక్తిగతంగా వాదనలను వినిపించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు బెంచ్‌.. విచారణ ప్రక్రియను డిసెంబర్‌ 4 నుంచి మొదలుపెట్టనున్నట్లు పేర్కొని అప్పటికి విచారణను వాయిదా వేసింది.

ఏపీ కేడర్‌ అలాట్‌మెంట్‌ జరిగినా తెలంగాణలో కొనసాగుతున్న అధికారులు…

ఏపీకి అలాట్‌ అయినప్పటికీ ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న వారిలో హరికిరణ్‌, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్‌ లోహటి, గుమ్మల సృజన, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాణీప్రసాద్‌, డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న అమ్రపాలి, ఐపీఎస్‌ ఆఫీసర్లు డీజీపీ అంజనీ కుమార్‌, అభిలాష్‌ భీష్ట్‌, అభిషేక్‌ మొహంతి. తెలంగాణ కేడర్‌గా కేటాయింపు జరిపినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్న శంషేర్‌సింగ్‌ రావత్‌, అనంతరాము కూడా క్యాట్‌ ఉత్తర్వులపైనే అక్కడ కొనసాగుతున్నారు. వీరి బదిలీ వ్యవహారం కూడా డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్నది.

క్యాట్‌ తీర్పును అడ్డం పెట్టుకుని తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్న అధికారులకు హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో? నన్న ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. వీరందరిపై కేంద్ర ప్రభుత్వం 2017లోనే రిట్‌ పిటీషన్‌ వేసింది. ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్‌ తో పాటు, అభిషేక్‌ మహంతి వంటి అధికారులున్నారు. హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై టెన్షన్‌ పడుతున్నారు. సోమేష్‌ కుమార్‌ విషయంలో గతంలో హైకోర్టు తీర్పును చూసి వీరు కూడా భయపడిపోతున్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం తెలంగాణ హైకోర్టును కోరింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై పలువురు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసిన క్యాట్‌.. అధికారులు తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు వెలువరించింది.

క్యాట్‌ ఉత్తర్వులతో డీజీపీ అంజనీ కుమార్‌ సహా 12 మంది అధికారులు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. కేంద్రం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై జూన్‌ 5న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశంతో ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌ ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారులో సుదీర్ఘ కాలం పని చేసిన సోమేశ్‌కుమార్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించారు. ఆయన్ను ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారించంటంతో జనవరి 12న ఆయన ఏపీలో రిపోర్టు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిశారు. అనంతరం నెల రోజులు ఎలాంటి పోస్టింగ్‌ లేకుండా ఖాలీగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రిటైర్‌ కావాల్సిన ఉన్నా.. ఈ ఏడాది ఫిబప్రరిలోనే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా నియామకమయ్యారు.

కాగా ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 376 మంది ఐఏఎస్‌, 258 మంది ఐపీఎస్‌, 149 ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ప్రత్యూష్‌ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు పంపకాలు చేసింది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీకి వెళ్లేందుకు కొందరు అధికారులు ఇష్టపడలేదు. వీరు క్యాట్‌ తీర్పునుఏ అడ్డం పెట్టుకొని తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వాస్తవానికి రూల్‌ 5(1) ప్రకారం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

అయితే సోమేష్‌కుమార్‌ తీర్పుకు భిన్నంగా అభిషేక్‌ మహంతి కేసు ఉందని అంటున్నారు. ఉమ్మడి ఏపీ పునర్విభజన సందర్భంగా ఆయనను కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను తెలంగాణకు కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలనా ట్రిబ్యునల్‌ అభిషేక్‌ మహంతిని తెలంగాణకు కేటాయించింది. ఈ మేరకు ఆయనను రిలీవ్‌ చేయాలని ఏపీ ప్రభుత్వానికి, విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది.

కాగా తెలంగాన ప్రభుత్వం ఆయనను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన మరోసారి ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అప్పటి సీఎస్‌ సోమేష్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కూడా వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం క్యాట్‌ ఆదేశాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌ను ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆయనకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కరీంనగర్‌ సీపీగా బాధ్యతలు అప్పగించారు.

మొత్తం 12మంది అధికారుల ఎపిసోడ్‌లో తుది వాదనలను విన్న హైకోర్టు తీర్పు ఎప్పుడిస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్‌ వాదనలు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఒకవేళ సోమేష్‌కుమార్‌కు వచ్చిన తీర్పే వస్తే ఈ 12మంది ఏపీకి వెళ్లాల్సి రానుంది. దీంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement