Sunday, April 28, 2024

వైసీపీ పతనం ప్రారంభం-విస్తరణ లుకలుకలే నిదర్శనం: జీవీఎల్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నిన్న మొన్నటి వరకు జగన్‌ ఒక్కడే తమకు నాయకుడని చెప్పుకున్న పాలకపక్షం నేతలు.. ఇప్పుడు పదవుల కోసం రోడ్డెక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ, అధికార పార్టీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయన్నారు. తమకు పదవుల కంటే నాయకుడే ముఖ్యమన్న వారంతా పదవుల కోసం ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నారని చెప్పారు. చివరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా నేతలు గైర్హాజరయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీమంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తే మరికొందరు అలక బూనారని తెలిపారు.

మంత్రివర్గం ఏర్పాటులో జగన్మోహన రెడ్డి విధానమేంటో అర్థం కావడం లేదని జీవీఎల్‌ పేర్కొన్నారు. మంత్రుల తొలగింపులో సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనమేంటని ఆయన ప్రశ్నించారు. సలహాదారు పదవి అనేది రాజ్యాంగ బద్దమైనదేమీ కాదన్నారు. సజ్జల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సమాధానం చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని కమ్మ, వైశ్య, క్షత్రియ కులాలకు చెంది కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీరంగణధారాజును సామాజికంగా అణగదొక్కినట్లు తమ పార్టీ అభిప్రాయపడుతోందని ఆయన పేర్కొన్నారు. సాధికారత అంటే సంఖ్య కాదని నిజమైన అధికారం ఇవ్వడం అని జీవీఎల్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement