Thursday, April 25, 2024

Spl Story: కథలు చెపుతున్న శిథిల సాక్ష్యాలు, భూమిపొరల్లో చరిత్ర ఆన‌వాళ్లు.. తవ్వకాల్లో వెలుగు చూసిన ఆధారాలు

చరిత్ర అనే తిమిరకోణాల్లోకి మన విజ్ఞాన తృష్ణను పంపిస్తే కనిపించే మౌనశిలలు, శిల్పాలు, విరిగిన గాజులు, పగిలిన పెంకులు, తవ్వకాల్లో వెలుగుచూసే కళేబరాలు ఆనాటి కథలు చెపుతాయి. కీసరగుట్ట తవ్వకాల్లో వెలుగుచూసిన విష్ణుకుండిన రాజుల ఆనవాళ్లు, శాసననాలు అప్ప‌టి మూఢ విశ్వాసాలకు ప్రతీకగా నిలిచాయి. ప్రపంచాన్ని ప్రశ్నించే క్రతువులు ఇక్కడ జరిగినట్లు శాసననాల్లోని అక్షర సత్యాలు వెలుగు చూశాయి. వైదిక సంప్రదాయ క్రతువులకు కీసర గుట్టను వేదికగా చేసుకుని నిత్యయజ్ఞయాగాదులతోపాటు పురుషమేధ, నరమేధ యాగాలు చేసినట్లు రెండవ మాధవవర్మ తామ్ర శాసనం స్పష్టం చేసింది. అయితే తవ్వకాల్లో లభించిన ఈ సత్యాలను పురావస్తు శాఖ గుంభనంగా ఉంచడం గమనార్హం.

– హైదరాబాద్‌. ఆంధ్రప్రభ

సుప్రసిద్ధ శైవక్షేత్రం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం. రావణ సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శివలింగాలును ప్రతిష్టిస్తూ కీసరకు చేరుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారనేది స్థలపురాణం. అయితే కీసర గుట్ట చుట్టూ వందలాది ఎకరాల విస్తీర్ణంలో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించి విష్ణుకుండిన రాజులు తెలుగునేలను ఏలినట్లు ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసిన అంశాలు. సుప్రసిద్ధ చరిత్రకారుడు దివంగత వి.వి. కృష్ణ శాస్త్త్రి అనేక సంవత్సరాలు చేసిన పరిశోధనను పురావస్తు శాఖ ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేస్తూ అనేక అంశాలను వెలుగులోకి తీసుకువస్తోంది.

- Advertisement -

క్రీ.శ 358 – 569లో విష్ణుకుండినరాజు రెండవ మాధవవర్మ రాజ్యకాంక్షతో కీసరగుట్టలో అనేక క్రతువులు చేసినట్లు ఇప్పటికీ యజ్ఞవాటికలు సాక్ష్యంగా ఉన్నాయి. విష్ణుకుండినరాజుల కాలంలో ప్రధాన పట్టణాలు, రాజధానిగా నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలో ఇంద్రపాల నగరం వర్ధిల్లింది. ప్రస్తుతం ఇంద్రపాలనగరం తుమ్మలగూడెం పేరుతో ఒక గ్రామంగా నేటికి ఉంది. రాజధానికి దగ్గరలోని కీసరలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించి ఆ కోటలోని వందలాది ఎకరాల స్థలంలో యజ్ఞవాటికలు నిర్మించి అనేక క్రతువులు చేశారు. ఇందులో ప్రధానమైంది పురుషమేధ యాగం.

పురుషమేధ యాగానికి వేదిక

క్రీశ. 440 నుంచి 4095 వరకు తెలుగునేలతో పాటుగా సముద్రదీవులపై అధికారబావుటా ఎగరవేసిన విష్ణుకుండినరాజు రెండవ మాధవవర్మ కీసరలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యజ్ఞవాటికలో నిత్యహోమాలు, యాగాలు, యజ్ఞాలు నిర్వహించారు. వందలాది మంది రుత్వికులు, వేదపండితులు, నిత్యాగ్ని హోత్రులు రాజాధరణతో యాగాలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పినాకుడు అనే బ్రాహ్మణున్ని యజ్ఞవాటికలో తలకిందులుగా చేసి మంత్రోచ్ఛరణల మధ్య ఆహుతి చేసిన సంఘటన అంత్యంత భయానకమైన సంఘటన. భారతదేశంలో తొలిసారి, చివరిసారిగా జరిగిన యజ్ఞమిదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నమేధయాగం(పురుష మేధ యాగం) చేసినట్లు విష్ణుకుండినరాజులు తమ తామ్ర శాసనాల్లో ప్రకటించుకున్నారు. యాగాల్లో అత్యంత అరుదైన ఈ యాగఫలమై విష్ణుకుండిన రాజుల విజయానికి కారణమని ఆనాటి రాజులు భావించినప్పటికీ తాము చేసింది పవిత్ర కార్యమని రెండవ మాధవవర్మ శాసనాల్లో పేర్కొన్నారు.

అయితే విష్ణుకుండినరాజులతో పాటిగా చరిత్రలో ఇతర రాజులు పురషమేధయాగం చేశారా, లేదా వీర బలులతోనే క్రతువులు ముగించారానే కోణంలో ప్రస్తుతం పురావస్తు శాఖ పరిశోధనలు చేస్తుంది. ఆనాడు శివారాధకులు స్వచ్ఛందంగా అసులు చాలించి శివసన్నిధి చేరుకున్నారనే కోణంలో పురావస్తు శాఖ పరిశోధనలు జరుగుతున్నాయి. నగర భువన బిరుదాంకితుడైన రెండవ మాధవవర్మ కీసరగుట్టలోని యజ్ఞవాటికల్లో 1000 క్రతువులు, 11అశ్వమేధయాగాలు నిర్వహించినట్లు చరిత్ర ఆధారాలు లభ్యమవుతున్నాయి.

కీసరలో యజ్ఞగుండాలు

కీసరగుట్టలో విష్ణుకుండిన రాజుల నాటి యజ్ఞగుండాలు నేటికి శిలావస్థలో ఉన్నాయి. ఇక్కడి యజ్ఞగుండాలను పరిశోధిస్తే వైదిక ఆచారాల మేరకు నిర్మాణాలు జరిగాయి. యాగాల్లో సుప్రసిద్ధమైన త్రికోణ, వృత్త, సమఅష్ఠాస్ర, సమ షడస్ర, చతుర, కోణాస్త్ర, పద్మ కుండలాకృతితో పాటుగా శాస్త్ర సమ్మతమైన అనేక ఆకారాలతో యజ్ఞగుండాల నిర్మాణాలు జరిగాయని పురావస్తు పరిశోధకులు చెప్పారు. యాగాల్లో సుప్రసిద్ధమైన అశ్వమేధయాగం, పుత్రకామేష్టియాగం, సర్పయాగం, విశ్వజిత్‌ యాగం, అహూరాత్రయాగం పంచమహాయాగాలు ఉన్నాయని చరిత్ర చెపుతుంది. అలాగే 7 పాకయజ్ఞాలు, 7 హనిర్యాగాలు, 7సోమయాగాలు కీసరవేదికగా విష్ణుకుండిన రాజులు చేసినట్లు చరిత్రకారులు చెపుతున్నారు. శ్రీశైలం భక్తులైన విష్ణుకుండినులు వీరశైవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పటివరకు ఉన్నజైనం, బౌద్ధం క్రమేణ అంతరించిపోయాయి. అయితే రాజ్యకాంక్ష కోసం శిరస్సులు తెగనరికిన చరిత్ర ఉన్నప్పటికీ పురుషమేధయాగాలు కూడా చేసినట్లు చరిత్ర కారుల అన్వేషణలో బహిర్గంతం కావడం మరో కొత్తకోణంగా భావిస్తున్నారు.

వీరబలులు, నరమేధయాగాలు జరిగాయి.. పురావస్తు శాస్త్రవేత్త వెంకటరత్నం

కీసరగుట్ట ప్రాంతాల్లో బులులు జరిగినట్లు తవ్వకాల్లో అనేక చరిత్ర ఆధారాలు లభ్యమైనట్లు సుప్రసిద్ధ శాసనపరిశోధకుడు, పురావస్తు శాఖ అధికారి వెంకటరత్నం ధ్రువీకరించారు. పురుషమేధయాగం చేసినట్లు రెండవ మాధవవర్మ శాసనాల్లో ఉందని చెప్పారు. అయితే ఈ యాగం కేవలం ఒక్కసారే జరగలేదనీ, అనేక పర్యాయాలు జరిగినట్లు తవ్వకాల్లో ఆధారాలు లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. కీసరగుట్టను తొలుత శాతవాహనులు, అనంతరం ఇక్ష్వాహకులు ఆతర్వాత విష్ణుకుండినులు పాలించినట్లు చరిత్ర ఆధారాలున్నాయన్నారు. అక్కడి మట్టిపొరల్లో దాగిన రహస్యాలు క్రమేణ బహిర్గంతం అవడంతో చరత్రలో కొత్త కోణానికి ప్రేరణ కలిగిస్తుందని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement