Friday, May 3, 2024

బీజేపీ ఎత్తుగ‌డ సాగ‌లే.. కొఠియాలో చతికిల పడ్డ అఖిలపక్షం..

సాలూరు రూరల్, (ప్రభ న్యూస్‌) : ఒడిశా రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లో అఖిలపక్షం చతికిల పడింది. అదేవిధంగా కొఠియా గ్రామాలతో పాటు వివాదంలో లేని గ్రామాల్లో చిచ్చుపెట్టేందుకు గత రెండేళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలకు ఓటర్లు బుద్ధి చెప్పినట్లైంది.. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక ఎన్నికల సందర్భంగా కొఠియా గ్రూపు గ్రామాల్లో తమ సత్తాచాటి ఆయా గ్రామాల ప్రజలు తమవైపే ఉన్నారని చాటి చెప్పేందుకు యత్నించిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు తల బొప్పి కట్టినట్లైందని చెప్పక తప్పదు.. అన్ని పార్టీలు ఒక్కటైనప్పటికీ వారి ప్రతిపాదనను కాదని వారి (అఖిలపక్షం) నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్ధి తికాయిగమెల్‌ (కాంగ్రెస్‌ రెబల్‌) ఘన విజయం సాధించారు. దీంతో అఖిలపక్షం నేతలకు శృంగభంగం అయిందనే చెప్పాలి.. ఈ నెల 18న కోరాపుట్‌ జిల్లా పొట్టంగి బ్లాక్‌నకు సంబంధించిన జోన్‌వన్‌ జిల్లా పరిషత్‌ స్థానానికి ఇద్దరు స్వతంత్ర అభ్యుర్ధులు పోటీ చేసారు. అధికార పార్టీ అయిన బీజేడీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై అఖిలపక్షంగా ఏర్పడ్డారు. ఆమేరకు గత జనవరి 21న కోరాపుట్‌ పట్టణంలో బీజెడీ, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతా కలిసి కట్టుగా పోరాడుదామని, ముందు మట్టి తరువాతే పార్టీ అంటూ నినాదాలు చెయ్యడమే కాకుండా అఖిలపక్షం అభ్యర్ధి ఏకగ్రీవం అవుతుందని భావించారు. అయితే వీరందరూ కలిసి కూడా తాము నిలబెట్టిన అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారు.

అఖిల పక్షం వారు పొట్ట ంగి బ్లాక్‌ తురియా గ్రామానికి చెందిన మమతా జానీని బరిలో నిలిపి, ఆమెకి ఓటేసి మన ఐక్యతను చాటుకుందామని ఓటర్లకు చెబుతూ ప్రచారం కావించారు. అయితే వారు ఊహించని విధంగా పైబ్లాక్‌ సిపాయి పుట్టి గ్రామానికి చెందిన తికాయి గమెల్‌ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ వేసి అఖిలపక్షం వారికి సవాల్‌ విసిరారు. అయితే అందరం ఒక్కటయామని తమ అభ్యర్ధి గెలుపు తధ్యమని అఖిలపక్షం వారు భావించగా, తాను తరతరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుటుంబానికి చెందిన వ్యక్తినని, కావున ఓటర్లు తనను గెలిపిస్తారంటూ తికాయి ధీమాను వ్యక్తం చేసారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చంద్రమ్మ శాంత వారసురాలినని తనను దీవించాలని ఓటర్ల ముందుకు వెళ్లారు. ఫలితంగా తన ప్రత్యర్ధిపై స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. అందులో భాగంగా శనివారం రాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో తికాయి తన ప్రత్యర్ధి మమతా జానీపై మూడు వేల 711ఓట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. తికాయికి పది వేల 354 ఓట్లు పోలవ్వగా, మమతా జానీకి ఆరువేల 643 ఓట్లు వచ్చాయి. దీంతో తికాయి స్పష్టమైన మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదిలావుండగా కొఠియా గ్రామాల్లో తమ పట్టును పెంచుకునేందుకు బీజేపీ నాయకులు వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లో తమ పార్టీని బలొపేతం చెయ్యాలని భావించి బంగపడ్డారని చెప్పక తప్పదు.. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంలో లేని కొదమ పంచాయతీలో చిచ్చుపెట్టే విధంగా ప్రయత్నాలు చేసారు. కాగా అఖిల పక్షం విజయంసాధిస్తే కొఠియా గ్రామాల్లోవారు అనుకున్నట్లుగా తమ జోరును పెంచే అవకాశం ఉంది. ఏదిఏమైనప్పటికీ కొఠియా గ్రామాలతో కలిసి ఉన్న జోన్‌ వన్‌ జెడ్పీ స్థానాన్ని కోల్పోవడం అఖిలపక్షం నేతల ఆశలకు గండి పడినట్లయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement