Tuesday, April 30, 2024

Delhi | ఓట్లు పడాలంటే సీటు, చోటు ఇవ్వాల్సిందే.. తెలంగాణ మహిళా కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్టీ పదవుల్లో, ఎమ్మెల్యే టికెట్లలో తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన ఆలిండియా మహిళా కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న నేతలు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మాట్లాడుతూ పార్టీలో మహిళా కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనాభాలో 51% మహిళలు ఉన్నారని, కానీ తెలంగాణ పీసీసీలో మాత్రం మహిళలకు సరైన ప్రాతినిథ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

20 మంది సభ్యులున్న కమిటీలో కనీసం ఇద్దరు మహిళలకు చోటివ్వడం లేదని అన్నారు. ఇదే విషయంపై పీసీసీ చీఫ్‌తో గొడవ పడుతుంటానని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 51% ఉన్న మహిళలకు కుర్చీ వేయాల్సిందేనని ఆమె అన్నారు. ఎమ్మెల్యే టికెట్లతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ అవకాశం కల్పించాలని అన్నారు. డబ్బు లేదు, గెలవలేరు అంటే కుదరదని ఆమె వ్యాఖ్యానించారు. కేవలం సర్వేల ఆధారంగా టికెట్లు అంటే మహిళలకు ఎక్కడా చోటు దక్కదని అన్నారు.

- Advertisement -

ఇక తన గురించి చెబుతూ.. తాను ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వచ్చానని, రాష్ట్రంలో తమ వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. తనకు ఎక్కడి నుంచైనా టికెట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ల కోసం బయోడేటాలు పట్టుకుని పలువురు మహిళా నేతలు సిద్ధంగా ఉన్నారని, ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఇప్పటికే అధిష్టానం పెద్దలకు దరఖాస్తు కూడా చేసుకున్నారని ఆమె తెలిపారు.

వేదికలపై నేతలు చేసే చేసే ప్రసంగాలు చాలా బావుంటాయని, కానీ ఆచరణలో మాత్రం మహిళలకు అవకాశాలు ఇవ్వడం లేదని సునీత రావు అన్నారు. తెలంగాణలో పార్టీ కార్యాకలాపాల్లో మహిళా కాంగ్రెస్‌ను అనుమతించడం లేదని ఆరోపించారు. తమకు అవకాశాలు కల్పిస్తేనే పార్టీ కోసం తిరుగుతామని, అవకాశాలు లేనప్పుడు మహిళలందరూ వెనుకడుగు వేస్తారని అన్నారు. తమ సమస్యలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చామని ఆమె చెప్పారు.

జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా కాంగ్రెస్ వద్ద నిధులు లేవని, తెలంగాణలోని వివిధ మండలాలు, జిల్లాల నుంచి మహిళా కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి తీసుకొచ్చేందుకు సైతం తమకు టీపీసీసీ సహకరించలేదని అన్నారు. ఢిల్లీలో జరిగే సదస్సుకు మండల కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లను ఆహ్వానించారని.. కానీ వారందరినీ ఢిల్లీకి తీసుకొచ్చేందుకు నిధులు లేకపోవడంతో 177 మంది ఎవరికివారుగా తమ సొంత ఖర్చులతో ఢిల్లీ వచ్చారని సునీత రావు చెప్పారు. తన హయాంలోనే రాష్ట్రంలో 35 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించాననని, అందులో ఒకరు తనను పనిచేయనీయడం లేదంటూ రాజీనామా చేశారని చెప్పారు.

తమవాళ్లను కమిటీలో పెట్టుకోవాలి అంటూ ఒత్తిళ్లలతో మండల, బ్లాక్ కమిటీలను వేయనీయడం లేదని అన్నారు. అయితే తాను పార్టీ కోసం కష్టపడ్డవారికి మాత్రమే మహిళా కాంగ్రెస్ పదవులు ఇచ్చానని అన్నారు. దాదాపు 70-80% వరకు మండల, బ్లాక్ కమిటీలు వేశానని, అయితే బూత్ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని చెప్పారు. బూత్ కమిటీల్లో కనీసం ఇద్దరైనా మహిళలు ఉంటే బావుంటుందని అన్నారు. అలాగే తాను మహిళా కాంగ్రెస్‌లో 50 మందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశానని, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందించి ధర్నాలు, ఆందోళన చేయడం కోసం టాస్క్‌ఫోర్స్ సిద్ధంగా ఉంటుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement