Thursday, May 16, 2024

Delhi | టార్గెట్ సౌత్.. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు దాటుతాం : జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 400 సీట్లకు పైగా సాధిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఆదివారం జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేయడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు.

- Advertisement -

దేశ రాజకీయాల్లో బీజేపీ ఎంత బలంగా ఉందో ఈ ఫలితాలు తెలియజేశాయని అన్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హ్యాట్రిక్ కొట్టామని చెబుతూ మూడు రాష్ట్రాల విజయానికి గుర్తుగా మూడు కేక్‌లను ఆయన కట్ చేశారు. అలాగే వరుసగా కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొడతామని, ఇందుకోసం దక్షిణాదిలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పారు. తమ తదుపరి లక్ష్యం దక్షిణ భారతదేశమేనని జీవీఎల్ చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ.. బీజేపీ సంస్థాగతంగా బలపడిందని జీవీఎల్ విశ్లేషించారు. పార్టీని దక్షిణాదిలో విస్తరించే కార్యాచరణ ఉందని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ గతం కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు. ప్రజలు విపక్ష కూటమి (ఇండియా)ను తిప్పికొట్టారని జీవీఎల్ అన్నారు. ఈ ఫలితాల తర్వాత ఆ కూటమికి బీటలు వారాయని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 6న జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో కాంగ్రెస్ ఎదురుదెబ్బ ఎదుర్కోనుందని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement