Sunday, April 28, 2024

టార్గెట్‌ 2024..! యాత్రలకు సిద్ధమవుతున్న తెదేపా అధినేతలు..

అమరావతి, ఆంధ్రప్రభ “ మహానాడు ఇచ్చిన అద్వితీయమైన సక్సెస్‌తో తెదేపా ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అధినేతలు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటినుంచి పార్టీ కేడర్‌, నేతల్లో గూడుకట్టుకున్న నిస్తేజం మహానాడుతో వదిలిపోయింది. ఊహించని విధంగా మహానాడుకు ప్రజలు అభిమానులు, కార్యర్తలు తరలిరావడంతో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలను సిద్ధం చేస్తూ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. కొద్దికాలంగా పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వస్తాయని. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్‌ ఇకపై ప్రజల్లోనే గడిపేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా అధినేత చంద్రబాబు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పర్యటనలకు సిద్ధమవుతుండగా.. యువనేత లోకేష్‌ పాదయాత్రకు అవసరమైన రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు పది నెలల పాటు ప్రజల్లో పూర్తిస్థాయిలో ఉండి పర్యటనలు చేసేలా కార్యాచరణను పార్టీ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. ఇదే క్రమంలో నారా లోకేష్‌ కూడా దాదాపు ఏడాది పాటు ప్రజల్లో గడపనున్నారు. యువనేత నారా లోకేష్‌ పాదయాత్ర షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్రకు సిద్ధమయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు ఇదే రోజున పాదయాత్రను ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన పాదయాత్ర టీడీపీని అధికారంలోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో దానినే సెంటిమెంట్‌గా తీసుకుని లోకేష్‌ కూడా అదే రోజున పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీలో లోకేష్‌ యాత్రపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. సైకిల్‌ యాత్ర చేపట్టాలని కొందరు ముఖ్యనేతలు సూచించగా.. మరికొందరు మాత్రం పాదయాత్రకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై కొంత చర్చ అనంతరం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో విస్తృతమైన పర్యటనలు చేస్తున్న ఆయన ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. అయితే మంగళగిరిలో దాదాపు 60 శాతం గ్రామాల్లో పర్యటించిన ఆయన బాదుడే – బాదుడు కార్యక్రమాన్ని మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తిచేయాలన్న యోచనలో ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో పర్యటనలు పూర్తిచేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆగస్టు నుంచి చంద్రబాబు పర్యటనలు..

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాదుడే – బాదుడు పేరిట జిల్లాల పర్యటనను ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలకు మంచి స్పందన వస్తుండటంతో త్వరలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ పర్యటనలు ఈఏడాది ఆగస్టు మాసం నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాదుడే – బాదుడు, క్విట్‌ జగన్‌ – సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ఈ పర్యటనలు సాగనున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలపై పడుతున్న భారాలతో పాటు ప్రధానంగా రాష్ట్ర అప్పులను ప్రజలకు చంద్రబాబు వివరించనున్నారు.

- Advertisement -

త్వరలో అధికారిక ప్రకటన..

చంద్రబాబు, లోకేష్‌ పర్యటనలు, పాదయాత్రకు సంబంధించి అతి త్వరలో తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. ఇప్పటికే ఈ యాత్రలు, పర్యటనలకు అవసరమైన రూట్‌మ్యాప్‌ను పార్టీ యంత్రాంగం సిద్ధం చేస్తుంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా పర్యటనలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. పాదయాత్రలకు, పర్యటనలకు ఎక్కడా బ్రేక్‌ పడకూడదు అన్న యోచనలో చంద్రబాబు, లోకేష్‌ ఉన్నారు. ప్రధానంగా లోకేష్‌ పాదయాత్రకు సంబంధించి రోజుకు ఎన్ని కిలోమీటర్లమేర పాదయాత్ర సాగాలన్న దానిపై చర్చిస్తున్నారు. దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని పార్టీ ముఖ్యనేతలు వెల్లడిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement