Tuesday, March 26, 2024

జూన్‌ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల.. ప్రధాన జలాశయాల్లో 425.16 టీఎంసీల నీటి నిల్వలు

  • జూన్‌ 10 నుండి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్‌కు
  • వర్షాలు పడేలోగా ఈనీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళిక
  • ఇవి వాడుకునేలోపు పడే వర్షాలతో మరో దఫా జలాశాయాలు నింపేందుకు ఏర్పాట్లు
  • ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల బారినుండి తప్పించుకునే ఏర్పాట్లు
  • ఈ ఖరీఫ్‌లో 95,23,217 ఎకరాల్లో సాగుకానున్న పంటలు.
  • ఈఏడాది ముందస్తుగానే నైరుతీ

అమరావతి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా సాగునీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జూన్‌ 1 నుండి దశలవారీగా సాగు నీటి విడుదలకు సిద్ధమౌతోంది. ఆమేరకు జలవనరుల శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉండటంతో నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఖరీఫ్‌ సాగును ముందస్తుగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని జిల్లాల్లో కలిపి 95,23,217 ఎకరాల్లో సాగుకానున్న పంటలకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో డ్యామ్‌ల్లో నీరు చేరిన తర్వాత జులై చివరిలోగానీ, ఆగస్టులో మొదటిలో గానీ సాగునీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది చాలా వరకు రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉండటంతో ముందుస్తుగా ఖరీఫ్‌ సీజన్‌ను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే ఇటీవల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ సాగునీటి విడుదల తేదీలను ముందుగానే ప్రకటించింది. ఆమేరకు జూన్‌ 1 నుంచి గోదావరి డెల్టాకు, జూన్‌ 10 నుండి కృష్ణా డెల్టా మరియు గుంటూరు ఛానల్‌కు నీటిని విడుదల చేయనున్నట్లు- పేర్కొంది. ఇందులో భాగంగా జూన్‌ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో మొత్తం 480.08 టీ-ఎంసీల నీటి లభ్యత ఉండగా, ప్రధాన జలాశయాల్లో 425.16 టీ-ఎంసీలు, మధ్యతరహా జలాశయాల్లో 53.8 టీ-ఎంసీలు, ఇతర జలాశయాల్లో 1.12 టీ-ఎంసీల వంతున నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా ఉండటంతో ఆ నీటిని మొదటి విడతలో ఉపయోగించుకోవడం ద్వారా సకాలంలో నైరుతీ రుతుపవనాల ద్వారా కురిసే వర్షాలను రెండో దఫాగా వినియోగించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. గతంలో ఈ విధమైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల జలశయాల్లోని నీటిని సద్వినియోగంచేసుకోలేకపోయామని అధికారులు పేర్కొంటు-న్నారు. ఫలితంగా వర్షాలకు జలాశాయాల్లోని నీరు వృథాగా పోవడం, కట్టలు తెగపోవడం వంటివి జరిగేవన్నారు. ఈసారి ముందస్తు ప్రణాళిక రూపొందించి ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా నీటి వృథాను అరికట్టడంతోపాటు కురిసిన వర్షాల నీటితో మరోమారు జలాశయాల్లో నిల్వచేసుకునే అవకాశం ఏర్పడుతుందని అటు వ్యవసాయ శాఖ, ఇటు జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా వృథాగా సముద్రంలో పాలయ్యే నీటిని అరికట్టి సాగునీటి రంగానికి ఉపయోగించుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. గతంలో వేసవి కాలంలో రిజర్వాయర్లలో నీటి మట్టాలు చాలా వరకు తగ్గుముఖం పట్టేవని, దీంతో పొలాలకు నీటి విడుదలలో జాప్యం జరుగేదని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది వరదలు, అకాల వర్షాల కారణంగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్లలోకి మరింత నీరు వస్తుందని భావిస్తున్నామని పేర్కొంటున్నారు. తద్వారా రిజర్వాయర్లలో నీటి లభ్యతను సద్వినియోగం చేసుకోవాలనేది ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు.

అప్పుడందుకే జాప్యం..

1980వ దశకంలో ముందస్తుగా లేదా షెడ్యూల్‌ ప్రకారం సాగునీటిని విడుదల చేసేవారని, అయితే తర్వాత విడుదల చేయడంలో జాప్యం జరిగిందని రైతులు గుర్తు చేసుకున్నారు. గోరకల్లు రిజర్వాయర్‌, ఔకు, గండి, ఎస్‌ఆర్‌బీసీ కింద రాయలసీమ ప్రాంత ఆయకట్టు- రైతులకు జూన్‌ 30 నుంచి ప్రభుత్వం సాగునీరు విడుదల చేయనుంది. సోమశిల, గండికోట, చిత్రావతి, బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టు- రైతులకు జూలై 10 నుంచి, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు జూలై 15 నుండి సాగు నీటిని విడుదల చేయనున్నారు. భూమిని సిద్ధం చేసుకోవడానికి, విత్తనాలు సిద్ధం చేసుకోవడానికి సమయం కావల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే రైతులకు ముందస్తు నీటి విడుదల గురించి ఇప్పటికే తెలియజేసింది. గతంలో భూమి సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లిన తరువాత సకాలంలో సాగు నీరు విడుదల కాకపోవడంతో వర్షాలపైన, ఎత్తిపోతల పథకాలపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి. వర్షాలు సకాలంలో పడక పోయినా, ఎత్తిపోతల నుండి సకాలంలో నీరు విడుదల కాకపోయినా సాగు ప్రక్రియ కొన్ని వారాలపాటు ఆలస్యమయ్యేది. ఫలితంగా రబీ సీజన్‌లో పంట కోత మరియు తదుపరి పంట సాగు అంశాల్లో ఆలస్యం అయ్యేది. సాధారణంగా ఏడాదికి రెండు సార్లు పంటలు సాగు చేసేవారమని, ఇప్పుడు ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంతో మూడో పంటకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు.

ఈ ఏడాది ముందస్తుగానే నైరుతి..

ఇదిలావుండగా ఈ ఏడాది ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలుకరిస్తాయని వాతవరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. జూన్‌ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి నైరుతీ పలకరింపు ఉండే అవకాశముందని, ఆతరువాత వారం వ్యవధిలో ఉత్తరాంధ్ర వరకూ అవి విస్తరించే అవకాశలున్నాయని పేర్కొంది. రానున్న 3 లేదా 4 రోజుల్లో ఈశాన్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వీటి పలకరింపు ఉండనుందని తెలిపింది. ఈక్రమంలోనే పరిస్థితులు మరింతగా అనుకూలిస్తే జూన్‌ 3వ తేదీన నైరుతీ రుతువపనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశముందని వాతవారణ శాఖ పేర్కంది.

- Advertisement -

తొలిసారిగా ముందస్తు ఖరీఫ్‌..

ఖరీఫ్‌కు రైతులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌ ముందుగానే ప్రారంభమైతే తుఫాన్‌ నెలగా భావించే నవంబర్‌ నాటికి పంట చేతికి వస్తుంది. రైతులు కూడా మూడు పంటలకు వెళ్లే అవకాశం ఉంటుంది. గతంలోరిజర్వాయర్లు నిండిన తర్వాత ఆగస్టులో సాగునీరు విడుదల చేసేవారని, ఇప్పుడు రైతులకు త్వరగా నీరు అందుతుందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా నీటి విడుదలను ప్రకటించడం శుభపరిణామమని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement