Sunday, April 28, 2024

Tamilanadu | చెన్నై సౌత్ బ‌రిలో త‌మిళి సై…

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన తమిళసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం విడుదల చేసిన మూడవ జాబితాలో తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఫైర్‌బ్రాండ్ నేత తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కే. అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు.

కేంద్ర మంత్రి డా. ఎల్. మురుగన్ నీలగిరీస్(ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నారు. వెల్లూరు నుంచి డా. ఏసీ షణ్ముగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వన్, కృష్ణగిరి నుంచి సి. నరసింహన్, పెరంబలూరు నుంచి టీఆర్ పారివేంధర్, తిరునెళ్వేలి నుంచి నైనార్ నాగేంద్రన్ పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తమిళనాడుతో ఎన్డీఏ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు అనంతరం బీజేపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది.

22న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల ఎంపిక..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం – జనసేన పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అనంతరం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శుక్రవారం జరిగే సమావేశంలో ఆ రాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఇందుకోసం 3 రోజుల క్రితమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి, మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు ఢిల్లీ చేరుకున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కంటే ముందు జరగాల్సిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలోనే దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలిసింది.

శుక్రవారం రాత్రి జరిగే సీఈసీ సమావేశంలో ఆ జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని, ఇతర పార్టీల నుంచి చేరిన వలస నేతలకే ప్రాధాన్యతనివ్వడంపై పార్టీలో ఓ వర్గం నేతలు అధిష్టానానికి లేఖ రాసిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. వలస నేతలతో పాటు మొదటి నుంచి పనిచేస్తున్న నేతలకు సైతం చోటు కల్పిస్తూ సమతూకం పాటించేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది.

అలాగే కొన్ని నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆప్షన్ ఇవ్వగా, వాటిలో బీజేపీ ఎక్కణ్ణుంచి పోటీ చేయాలన్నది ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తంగా 6 పార్లమెంట్ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement