Monday, April 29, 2024

Review – మ‌ల్కాజిగిరిలో కాంగ్రెస్ జండా ఎగ‌రాల్సిందే… రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తాను సీఎం కుర్చీలో కూర్చోవడానికి మల్కాజిగిరి లోక్ స‌భ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలే కారణమన్నారు పిసిసి తెలంగాణ చీఫ్,ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. నాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై జెండా మోసి తనను ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. మల్కాజిగిరి నేతలతో రేవంత్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, 2,964 బూత్‌లలో ప్రతీ బూత్‌లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని అన్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్ స‌భ స్థానం మల్కాజిగిరి అని.. మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని తెలిపారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని అన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా మల్కాజిగిరిలో పరిధిలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని గుర్తుచేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది అన్నారు. అందుకే మల్కాజిగిరి లోక్ స‌భ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి.. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు రేవంత్ రెడ్డి.

లోక్ సభతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని సూచించారు. హోలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని.. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. బలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థులు ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాల‌న్నారు.. మల్కాజిగిరి లో గెలుపు అభ్యర్థిది కాదు.. తనది అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement