Saturday, April 27, 2024

ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అనుకున్నంత పని చేశారు. ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ ఇవాళ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అంతేకాదు తాలిబన్లు శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం దేశ అధ్యక్షుడి బంగ్లాకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఒక ఆంగ్ల వార్తా సంస్థ ధ్రువీకరించింది.తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు.

అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్ వైపు వస్తున్నట్లు తెలిపారు.ఇదిలావుండగా, ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి నిరోధం లేకుండానే కాబూల్‌లోకి తాలిబన్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో, కాబూల్ గేట్ల వద్దనే వేచి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘన్ యువతులపై దాడులు చేయడం లేదు: తాలిబన్ ప్రతినిధి సుహైల్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement