Thursday, May 9, 2024

ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి చూడండి.. రాహుల్‌పై హోంమంత్రి అమిత్‌షా చురక..

న్యూఢిల్లి : కాంగ్రెస్‌ నేత, వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ధరిస్తున్న ఇటాలియన్‌ కళ్లద్దాలను తొలగించి చూస్తే ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కన్పిస్తుందని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఇటీవల రాహుల్‌ సహా కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలపై హోంమంత్రి విరుచుకుపడ్డారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నమ్‌సాయి జిల్లాలో వెయ్యికోట్లతో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ఆదివారంనాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్‌ సహా కాంగ్రెస్‌ నేతలకు చురకలు అంటించారు. ఈ ఎనిమిదేళ్లలో ఏం సాధించారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారని, వారు కళ్లుమూసుకుని నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అరుణాచల్‌లో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి పెమఖండు సారథ్యంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి చూస్తే రాహుల్‌గాంధీకి కన్పిస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనలో రికార్డు సృష్టించామని, శాంతిభద్రతలు మెరుగయ్యాయని, పర్యాటక రంగం పుంజుకుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ సారధ్యంలో 50 ఏళ్లలో చేయని అభివృద్ధి గత ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. అంతకుముందు ఉదయం స్థానిక గోల్డెన్‌ పగోడాను ఆయన సందర్శించి పూజలు చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం రక్షణ బలగాలు, జాతీయ రహదారులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement