Monday, May 20, 2024

ఎండాకాలం.. వాహనాలు భద్రం..

వేసవిలో.. ఎండల తాపం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు ముందస్తుగా అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం నిత్యం వాడే ద్విచక్ర వాహనం విషయంలోనూ ఆ జాగ్రత్తలు అవసరం. అలా తీసుకోకుంటే ఇంధన పరంగా నష్టపోతాం. దానితోపాటు వాహనం మరమ్మతులకు గురై కొత్త ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్‌ నుంచి పొగలు రావడం, టైర్‌పంక్చర్‌ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అధిక దూరం వాహనాల్లో ప్‌వయాణించేటపుడు జాగ్రత్తలు పాటించాలి.. మధ్యలో గంటగంటకు వాహనం ఆపి ఇంజన్‌ చల్లబరచాలి. లేకుంటే వాహనాలు హీట్‌ కి వాహనాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది.. వాటి నుంచి గ‌ట్టెక్కాలంటే వేసవిలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
– ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌

వాహనాన్ని ఎండలో పార్కింగ్‌ చేస్తే ఇంధనం ఆవిరవుతుంది. ట్యాంకులను ఇనుముతో తయారు చేయడంతో ఎండకి ఆ ట్యాంకులు వేడెక్కి అందులోని పెట్రోల్‌, డీజిల్‌ ఆవిరవుతుంది. వాహనాన్ని గంటసేపు ఎండలో ఉంచితే సుమారు 40 నుంచి 80 మిల్లీ లీటర్లు ఇంధనం మాయమవుతుంది. ఎండకు ఉంచిన వాహనాల టైర్లు, ట్యూబ్‌లు మెతకబడి వాటి సామర్థం తగ్గిపోతుంది. త్వరగా పంచర్లుపడే అవకాశం ఉంటు-ంది. ఎండలో గంటలు తరబడి ఉంచడంతో రంగు త్వరగా వెలిసిపోతుంది. హెడ్‌లైట్‌ డోమ్‌లు, బ్రేక్‌వైర్లు, హ్యాండిల్‌ గ్రిప్స్‌, సీటు- కవర్లు, ట్యాంకు పైకవర్లు, సైడ్‌ మిర్రర్స్‌ ఇలా ప్లాస్టిక్‌, ఫైబర్‌తో చేసినవి కావడంతో పాడైపోతుంటాయి. అదేవిధంగా ఎండాకాలం లాంగ్‌ డ్రైవ్‌ చేసేవారు జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ దూరం వాహనంలో వెళ్లేటపుడు గంటగంటకు వాహనం ఆపి ఇంజన్‌ చల్లబడే వరకు ఉంచాలి.. లేదంటే ఇంజన్‌ లో హీట్‌ పెరిగి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటు-ందని నిపుణులు అంటు-న్నారు. సాధ్యమైనంటరకు నీడలోనే వాహనాలను పార్క్‌ చేస్తే ఉత్తమం అని సూచిస్తున్నారు.

వేసవిలో రూ.వేలల్లో ఖర్చు..
నెలకు సుమారు 7 లీటర్ల ఇంధనం ఆవిరైపోతే రూ.800లు వృథాగా పోయినట్లే. వాహన రంగు మళ్లీ వేయాలంటే రూ. 5వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. అయినా కంపెనీవారు ఇచ్చిన కచ్చితమైన రంగులా ఆకట్టుకోలేవు. టైర్లు, ట్యూబ్‌లు పాడైతే రూ. 3వేల నుంచి 5వేల వరకు ఖర్చవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
వాహనాలను ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదు. అలా ఉంచితే పెట్రోల్‌, డీజిల్‌ ఆవిరైపోతుంది. రంగు సైతం వెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు నీడలోనే ఉంచాలి.
వాహనాలు పార్క్‌ చేసినప్పుడు తప్పనిసరిగా కవర్లు కప్పాలి. రాత్రి సమయాల్లో పెట్రోలు పోయిం చుకోవడం మేలు.
టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అధిక వేడివల్ల గాలి తగ్గిపోతుంది. గాలి లేకున్నా.. అదే పనిగా వాహనాన్ని నడిపితే టైర్ల మన్నిక తగ్గుతుంది.
ద్విచక్రవాహనాలపై సుదూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సివస్తే ప్రతి 50 కిలో మీటర్లకొకసారి బండిని 15 నిమిషాలు ఆఫ్‌ చేయాలి. దీనివల్ల ఇంజిన్‌ చల్లబడుతుంది.
ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా శక్తిని కోల్పోతుంది. దీనివల్ల ఇంజిన్‌ మన్నిక తగ్గుతుంది. ఇంజిన్‌ ఆయిల్‌ను 15 రోజులకొకసారి తనిఖీ చేయించుకోవాలి.అధిక వేడి వల్ల రబ్బర్‌ విడిభాగాలు త్వరగా పాడవుతాయి.
నాలుగు చక్రాల వాహనాల రేడియేటర్‌లోని నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్‌ పాడయ్యే అవకాశం ఉంది. రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంటు ఆయిల్‌ వాడటం మంచిది. ఇంజిన్‌ ఆయిల్‌ తగ్గే ప్రమాదం ఉండటంతో అప్పుడప్పుడూ ఆయిల్‌ లెవెల్‌ తనిఖీ చేసుకోవాలి.
ఎండాకాలం పూర్తయ్యేవరకు కొత్త టైర్లు వాడాలి. సెకండ్‌ హ్యాండ్‌, చైనా, బటన్‌ టైర్లజోలికి వెళ్లక పోవటం మంచిది.
ఇప్పుడొస్తున్న వాహనాలన్నీ ఫ్యూజులు, కంప్యూటర్లతో అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కాబట్టి వాహనంలోని వైరింగ్‌ వ్యవస్థను ప్రతి 15 రోజులకోసారి క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఎల్‌పీజీ వాహనాలు ఉపయోగించేవారు వేసవిలో వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. అధిక ఉష్ణోగ్రత వల్ల గ్యాస్‌ అధిక పీడనానికి గురయ్యే ప్రమాదముంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగించుకోవడం చాలావరకు సురక్షితం.వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement