Sunday, April 28, 2024

Delhi | కేంద్రంపై దశలవారీ పోరాటం.. ప్రకటించిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రైతులకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది. గురువారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త సదస్సులో కేంద్ర ప్రభుత్వంపై దశలవారీగా పోరాడేందుకు తీర్మానించింది. ఈ సదస్సు అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, అఖిలభారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి. సాగర్ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం తీసుకొస్తామని చెప్పి మోసగించిందని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించలేదని అన్నారు.

నలుగురు రైతులు ఒక విలేకరి మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆశిష్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, రైతాంగంపై అక్రమంగా బరాయించిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అనేక త్యాగాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగేలా 4 కార్మిక నియమావళులుగా మార్చిందని దుయ్యబట్టారు. వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు , జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహా పడావులు నిర్వహించాలని తమ శ్రేణులను ఆదేశించారు. డిసెంబర్, జనవరి మాసాల్లో దేశవ్యాప్తంగా బస్సు యాత్రలు, జీపు యాత్రలు, పాదయాత్రలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఇందులో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యావంతులు, మేధావులు ఈ పోరాటానికి అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ డిమాండ్లతో పాటు కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇవ్వాలని, అర్హులైన పోడు రైతులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, పంటలు నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement