Sunday, May 5, 2024

ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల పెంపునకు చ‌ర్య‌లు.. రెండు, మూడు నెలల్లో 138 స్టేషన్లు అందుబాటులోకి

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకు ఈవీ వాహనాలను ఎక్కువ సంఖ్యలో పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పెరిగిన ఈవీ వాహనాలకు సరిపడా.. ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వననరుల అభివృద్ధి సంస్థ ( రెడ్కో ) ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త్తంగా 138 ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం కసరత్తు చేసిన రెడ్కో.. జీహెచ్‌ఎంసీతో కలిసి హైదరాబాద్‌లో కూడా త్వరలో 14 స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని చర్యలు చేపట్టింది. ఫేమ్‌ -1 పథకం కింద ఇప్పటికే 30 ఛార్జింగ్‌ స్టేషన్లను వివిధ ప్రభుత్వరంగ సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో రవాణ, వ్యక్తిగత వాహనాల వాడకంతో ఏర్పడుతున్న కాలుష్యంపై.. బ్రిటన్‌ ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి రెడ్కో సంస్థ ఇటీవలనే అధ్యయనం చేసింది. నిత్యం వందలాది వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, దీంతో కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, అందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోం పెరగాల్సిన అవసరం ఉందని అధ్యయన సంస్థ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణిస్తున్న వారిలో 47.8 శాతం మంది వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్నారు.2000 సంవత్సరంలో నగరంలో 7 లక్షల వాహనాలుంటే.. 2020 నాటికి 53 లక్షలకు చేరాయి. ఈ రెండేళ్ల కాలంలో కూడా ప్రతి ఏటా లక్షల్లోనే వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. ప్రతి రోజు కొత్తగా 1,200 వాహనాల వరకు రోడ్లపైకి వస్తున్నాయి. వీటి వల్ల హైదరాబాద్‌లో భారీగా బొగ్గు పులుసు వాయువు గాలిలోకి చేరుతోంది. దీంతో మానవాళిపై ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందని వివిధ రంగాల నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీ వాహనాలను ప్రొత్సహించాలని రెడ్కో ఒక నిర్ణయానికి వచ్చింది. కాగా ఇటీవల ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరుగుతన్నది. భవిష్యత్‌లోనూ ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని రెడ్కో భావిస్తోంది.

అందుకు అనుగుణంగా 138 ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణకు ఫేమ్‌-2లో భాగంగా 138 ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలను కేంద్రం కేటాయించింది. అందులో హైదరాబాద్‌లో 118, కరీంనగర్‌లో 10, వరంగల్‌లో 10 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు రెడ్కో కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీతో జత కట్టి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం 14 ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహమివ్వడంతో ఇటీవల వాహనాల కొనుగోళ్లు జరుగుతున్నట్లు రావాణా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈఎస్‌ఎల్‌ 49, ఎన్టీపీసీ 32, ఆర్‌ఈఐఎల్‌ 37 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థలు పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు కూడా పొందాయి. మూడు లేదా నాలుగు నెలల్లో వాటి పనులు పూర్తయితాయని రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లలో ఒక్కో యూనిట్‌కు రూ. 12.6 పైసల చొప్పున, అదనంగా జీఎస్టీ చార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఛార్జింగ్‌ స్టేషన్లు పూర్తయితే రహదారులపై ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement