Friday, April 26, 2024

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ.. పోటా పోటీగా ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ నగరంలో ఫ్లెక్సీల వ్యవహారం ముగిసింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను పెట్టిన బీజేపీ సాలు దొర, సెలవు దొర అంటూ ప్రచారం ప్రారంభించింది. దీనికి కౌంటర్‌గా సాలు మోడీ… సంపకు మోడీ, బైబై మోడీ పేరుతో ప్రధానిపై ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఈ పోటాపోటి ఫ్లెజ్సీలపై నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. కంటోన్మెంట్‌లో మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీని తొలగించిన అధికారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా వెలిసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌ను పూర్తిగా కాషాయమయం చేయాలని బీజేపీ వేసిన పథకాన్ని టీఆర్‌ఎస్‌ చిత్తు చేసింది. ఎక్కడా ఫ్లెక్సీలు, కటౌట్‌లకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఎక్కడికక్కడే పార్టీ నేతలకు సంకేతాలను పంపించారు.

మరో పక్క ఫ్లెక్సీల తయారీదారులు, వాటిని ఏర్పాటు చేసే వారికి కూడా ముందస్తుగా నోటీసులను కూడా జారీ చేసింది. అంతే కాకుండా మెట్రో పిల్లర్లు, ఫ్లై ఓవర్ల పిల్లర్లన్నింటినీ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ హోర్డింగ్‌లను కాంట్రాక్టుకు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ బొమ్మలతో నింపేసింది. ఈ హఠాత్‌ పరిణామంతో బిత్తరపోయిన బీజేపీ నేతలు కేవలం వాల్‌ పోస్టర్ల ద్వారానే జూలై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభకు తరలి రావాలంటూ ప్రజలను కోరుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీజేపీ నేతలు ప్రత్యామ్నాయ ప్రచార కార్యక్రమాలపై బిజీగా మారారు. రాష్ట్రంలో గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా రాజకీయం రంజుగా సాగుతోంది. సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో నిత్యం ఇరు పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించి టీఆర్‌ఎస్‌కు మరింత ధీటుగా సవాల్‌ విసరాలని భావించిన కమలనాథుల ఎత్తులకు పై ఎత్తు వేసిన టీఆర్‌ఎస్‌ ధీటుగా ఎదుర్కుంటామన్న సంకేతాలను పంపించిందంటూ రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నందున హైదరాబాద్‌లో మున్నెన్నడూ లేని విధంగా భారీ బహిరంగసభ నిర్వహించడంతో పాటు దాదాపు 10 లక్షల ణందిని సభకు తరలించి సత్తా చాటాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్లతో ప్రసంగాలు ఉండేలా కార్యక్రమాన్ని సిద్దం చేసింది. అయితే బహిరంగసభ జరిగే పరేడ్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాలలోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బై బై మోడీ అంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసింది.

అప్రమత్తమైన అధికార యంత్రాంగం..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యేందుకు ఇంకా మూడు రోజులున్నప్పటికీ టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లలో ప్రచారహోరును దృష్టిలో పెట్టుకున్న అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న ఆందోళనతో ఉన్న అధికారయంత్రాంగం ఎప్పటికప్పుడు ఇరు పార్టీలలో జరిగే పరిణాలాను నిశితంగా పరిశీలిస్తున్నారు. మరో పక్క ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలలోని అనేక మంది నేతలు నగరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఏ చిన్న ఘటన జరిగినా దేశ వ్యాప్తంగా పరువుపోతుందన్న ఆందోళనతో పోలీసు శాఖ ఉన్నది. నగరంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా ప్రధాని పర్యటనపై పీఎంవో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

- Advertisement -

బుధవారం ఉదయం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయిన పీఎంవో కార్యాలయ సిబ్బంది ప్రధాని భద్రత, ఆయన బస తదితర అంశాలపై చర్చించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హైటెక్స్‌ ప్రాంగణంలోనే ప్రధాన మంత్రి బస చేస్తే బాగుంటుందని రాష్ట్ర పోలీసు అధికారులు పీఎంవో అధికారులకు సూచించారు. అయినప్పటికీ వారు రాజ్‌భవన్‌ను కూడా సందర్శించడంతో పాటు ప్రధాని కాన్వాయ్‌ రాకపోకలకు సంబంధించిన ట్రయల్స్‌ను ఎస్‌పీజీ అధికారులు కూడా నిర్వహించారు. ప్రధాని బస ఎక్కడ అన్న అంశంపై గురువారం ఉదయం వరకు స్పష్టత రావచ్చని అధికారులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement