Saturday, May 4, 2024

పోరాడి ఓడిన శ్రీకాంత్.. బీడబ్ల్యూఎఫ్ పోటీల్లో ఇండియాకు రజత పతకం..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో తెలుగు కిశోరం కిదాంబి శ్రీకాంత్‌ రజత పతకంతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌పోరులో సింగపూర్‌కు చెందిన లో కియాన్‌ యోతో పోరాడిన తెలుగుతేజం శ్రీకాంత్‌ రజతంతో మెరిశాడు. టైటిల్‌ పోరులో 15-21, 20-22తేడాతో ఓడినా భారత్‌కు తొలి రజతాన్ని అందించి పురుష షట్లర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ పోరులో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌-సింగ్‌పూర్‌కు చెందిన లో కియాన్‌ యో తొలిసారి తుదిపోరులో తలపడ్డారు. మ్యాచ్‌ ఆరంభంలోనే కియాన్‌ తొలిపాయింట్‌ సాధించినా అనంతరం శ్రీకాంత్‌ పుంజుకుని వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 9-7 ఆధిక్యాన్ని సాధించాడు. సగం సమయం ముగిసేసరికి శ్రీకాంత్‌ తన ఆధిక్యాన్ని 11-7కు పెంచుకున్నాడు. అయితే కియాన్‌ 11-11తో స్కోరు సమం చేసి శ్రీకాంత్‌ను అధిగమించి 15-13తో వెనక్కి నెట్టాడు. అదే జోరుతో తొలిసెట్‌ను 21-15తో శ్రీకాంత్‌పై గెలుచుకున్నాడు.

రెండో సెట్‌లో స్మాష్‌లతో విరుచుకుపడిన శ్రీకాంత్‌ 7-4తో ఆధిక్యాన్ని సాధించినా కియాన్‌ 9-9తో స్కోరును సమం చేశాడు. రెండో గేమ్‌లో అద్భుత స్మాష్‌తో 11వ పాయింట్‌ సాధించిన కియాన్‌ 11-9తో దూసుకుపోయాడు. అయితే శ్రీకాంత్‌ 14-14తో స్కోరు సమం చేయడంతో భారత అభిమానుల ఆశలు చివురించాయి. వారి ఆశలకు తగ్గట్లుగానే శ్రీకాంత్‌ తన ఆధిక్యాన్ని 17-15కు పెంచుకున్నాడు. ఇకనుంచి ఇరువురు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసింది. సెకండ్‌ గేమ్‌లో 20-20స్కోరు సమం అవడంతో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. ఒక్క పాయింటు గెలిచి శ్రీకాంత్‌ రేసులోకి వస్తాడనుకున్న తరుణంలో కియాన్‌ విరుచుకుపడి 22-20తో రెండో సెట్‌ను గెలుచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. లో కియాన్‌ యో 21-15, 22-20తేడాతో వరుస సెట్లలో శ్రీకాంత్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో శ్రీకాంత్‌ రజత పతకాన్ని సాధించి సిల్వర్‌ మెడల్‌ సాధించిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement