Saturday, December 7, 2024

Delhi | విశాఖ టు వారణాసి ప్రత్యేక రైళ్లు.. ఎంపీ జీవీఎల్ చొరవతో గంగా పుష్కరాలకు ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గంగా పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి వారణాసికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. గంగా పుష్కరాల సందర్భంగా విశాఖ నుంచి వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు బుధవారం రైల్వే బోర్డు ప్రకటించింది. శ్రీ కాశీ తెలుగు సమితి గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు తగిన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం, వారణాసి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నారు. గంగా పుష్కరాలకు తరలివచ్చే ప్రయాణికులు ఎదుర్కొనే రైళ్ల సమస్య మీద దృష్టి సారించారు.

వాల్తేరు డివిజన్ ప్రత్యేక రైళ్ల కోసం ప్రతిపాదనలు పంపగా, జీవీఎల్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రైళ్ల మంజూరుకు కృషి చేశారు. ఇందులో భాగంగా వేసవి కాలంలో రద్దీ కారణంగా విశాఖ నుంచి వారణాసికి మే నెలలో ఐదు రోజులు, జూన్‌లో నాలుగు రోజులు నడుస్తాయి. సాగరతీర నగరం నుంచి కాశీకి ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26వ తేదీల్లో బయలుదేరతాయి. ఏప్రిల్ 20, 27వ తేదీల్లో తిరిగి వైజాగ్ చేరుకుంటాయి. విశాఖ ప్రజలు, వ్యాపారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ జీవీఎల్ వెల్లడించారు. మరింత ఎక్కువ మంది యాత్రికులు వారణాసి వెళ్లేందుకు వీలుగా విజయవాడ, తిరుపతిల నుంచి కూడా ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement