Thursday, May 9, 2024

G-20 Summit | టూరిజం సుస్థిరాభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. పర్యాటక మంత్రుల భేటీలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

గోవా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి: గోవా రోడ్ మ్యాప్‌తో పర్యాటక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పర్యావరణహిత, టూరిస్టు కేంద్రిత విధానాల ద్వారానే పర్యాటక రంగ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా గోవా రాజధాని పణజీలో జరుగుతున్న జీ20 పర్యాటక మంత్రుల సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, ప్రపంచ పర్యాటక రంగ అభివృద్ధికి ఐదు ప్రాధాన్యతాంశాలైన గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక రంగ ఎంఎస్‌ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు అంశాలపై పరస్పర సమన్వయంతో పనిచేద్దామని కేంద్రమంత్రి సూచించారు.

దీనికి సభ్య దేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన ‘మిషన్ లైఫ్’ స్ఫూర్తితో.. ‘ట్రావెల్ ఫర్ లైఫ్’ ఉద్యమాన్ని(క్యాంపేన్) కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర, బాధ్యతాయుత, సమగ్రమైన పర్యాటక విధానాన్ని అలవర్చుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. పర్యాటక రంగం అత్యంత వేగంగా ఎదుగుతూ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక రంగం ద్వారా పెద్దసంఖ్యలో ఉపాధి కల్పనతోపాటుగా సామాజిక-ఆర్థిక ప్రగతి సాధ్యమవుతోందన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సమగ్రతకు పర్యాటక రంగం ఎంతగానో తోడ్పడుతోందని చెప్పారు.

యువత, మహిళలను పర్యాటక రంగంతో అనుసంధానం చేయడం ద్వారా మరింత సానుకూల ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణ నిర్మాణం, ప్రయివేట్ రంగ భాగస్వామ్యం, సృజనాత్మకత, వినూత్నమైన ఆలోచనల కలబోతతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

- Advertisement -

పర్యాటక రంగం ద్వారా సాంస్కృతిక, ప్రాకృతిక సంపదను కాపాడుకోవచ్చన్న కేంద్రమంత్రి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో వీటిని కాపాడుకోవడం కూడా చాలా కీలకమని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనానంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు పరస్పర సమన్వయంతోపాటుగా ప్రపంచ ఉత్తమపద్దతులను షేర్ చేసుకుంటూ ముందుకెళ్దామని కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం పబ్లిక్-ప్రయివేట్ పార్ట్ నర్ షిప్స్ ద్వారా పెట్టుబడులను ఆకర్శించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement