Thursday, May 2, 2024

వామపక్ష ప్రభావిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వామపక్ష ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్ర సహాయ పథకం కింద రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రత్యేక కేంద్ర సహాయం పథకం కింద జరిగిన అభివృద్ధి, మార్పు వచ్చిన ఆయా జిల్లాల వివరాలపై టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రరావు కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. మంగళవారం కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ ఆయనకు లిఖితపూర్వక జ‌వాబిచ్చారు. వామపక్ష తీవ్రవాదాన్ని పరిష్కరించేందుకు 2015 ప్రత్యేక కేంద్ర సహాయ పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రి వివ‌రించారు. ఇందులో భాగంగా రోడ్డు నెట్‌వర్క్ విస్తరణ, టెలీకమ్యూనికేషన్ కనెక్టివిటీని మెరుగుపరచడం తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు.

ప్రభావిత జిల్లాల్లో ప్రోత్సాహం కోసం మౌలిక సదుపాయాల కల్పన, వివిధ రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పథకం కింద రాష్ట్రాలకు నిధులిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద గత మూడేళ్లలో రాష్ట్రాలకు రూ.2423.24 కోట్లు విడుదల చేయగా, వాటిలో 7815 పనులు పూర్తయ్యాయని… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.480 కోట్లు విడుదలయ్యాయ‌ని మంత్రి వెల్లడించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు 2009 సంవత్సరంతో పోలిస్తే 2021 సంవత్సరానికి దాదాపు 77 శాతం తగ్గాయని, మరణాలు (పౌరులు, పోలీసులు బ‌ల‌గాలు) 2010 సంవత్సరంలో 1005 ఉంటే 2021 నాటికి 147కి అంటే 85 శాతానికి తగ్గాయని ఆయన వివరించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు 2010 సంవత్సరం లో 96 ఉంటే 2021వ సంవత్సరం నాటికి 46కు తగ్గాయ‌ని మంత్రి నిత్యానందర రాయ్ జవాబులో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement