Saturday, April 27, 2024

ఏపీలో పిల్లల కోసం ప్రత్యేక బడ్జెట్

ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి పిల్లల కోసం కేటాయింపులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకుని అన్ని శాఖల నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలను స్వీకరించింది. 18ఏళ్ల లోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నివేదించనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే 3నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్సు రూపంలో ఆమోదించారు. దీనికి సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొత్తం 12 నెలలకు బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ 9 నెలల కాలానికి ఆమోదం తీసుకుంటారు.

మహిళల పథకాలకు కేటాయింపులు విడిగా..
మహిళలు, బాలికల సంక్షేమ పథకాలు.. వాటి కేటాయింపులను కూడా బడ్జెట్‌లో విడిగా క్రోడీకరించనున్నారు. వారి పురోగతికి దోహదపడుతున్న పథకాలను ప్రస్తావించనున్నారు. ఇదే సమయంలో ప్రణాళికేతర వ్యయం, కార్యాలయాల నిర్వహణ, వాహనాల ఖర్చులు తదితరాలపై కోత పడనుంది. వీటికి సంబంధించి 2020-21 బడ్జెట్‌లో దాదాపు అన్నింటిలోనూ 20శాతం వరకు కోత పెట్టారు. కార్యాలయాల అద్దె చెల్లింపులు భారమయ్యాయి. కొత్తగా వాహనాలు కొనవద్దని నిర్దేశించారు. కన్సల్టెంట్లు, పొరుగుసేవల సిబ్బంది నియామకంపై కట్టడి విధించారు. తాజా బడ్జెట్‌లో వీటన్నింటిపైనా ప్రభావం పడుతుంది.

పీఆర్సీ మాటేమిటో?
11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక ఇప్పటికే ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ప్రస్తుతం 27శాతం మధ్యంతర భృతి ఇస్తున్నారు. కొత్తగా ఫిట్‌మెంటు నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌లో పీఆర్సీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే జీతాలు, పింఛన్ల కేటాయింపులు చూపే అవకాశం లేదు. పీఆర్సీ ప్రకటించాక అవసరమైన మేరకు మంజూరు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పీఆర్సీపై బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావన ఉంటుందేమోనని ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement