Thursday, May 2, 2024

స్పేస్ ఎక్స్ ఎక్ర్టార్డిన‌రి రికార్డు.. ఒకేసారి 52 శాటిలైట్లు కక్ష్యలోకి..

అంతిరిక్ష ప్రయోగాల్లో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరొక మైలురాయిని అధిగమించింది. ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఒకేసారి 52 స్టార్‌ లింక్‌ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాలిఫోర్నియా నుంచి శనివారం ఉదయం 7.41 గంటలకు ప్రయోగించిన ఈ రాకెట్‌ 52 స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. రెండు దశలుగా సాగిన ఈ రాకెట్‌ ప్రయాణంలో తొలుత సముద్రంలోని స్పేస్‌ఎక్స్‌ డ్రోన్‌ షిప్‌ మీదికి చేరుకొని, రెండో దశలో ఉపగ్రహాలతో కక్ష్యలోకి దూసుకెళ్లినట్లు లాంచ్‌ కమాండర్‌ తెలిపారు. స్టార్‌ లింక్‌ అనేది ఉపగ్రహ ఆధారిత ‘గ్లోబల్‌ ఇంటర్నెట్‌’ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సర్వీసులకు దూరంగా ఉన్న ప్రాంతాలను సైతం అనుసంధానం చేసేందుకు కొన్నేళ్లుగా స్పేస్‌ఎక్స్‌ ఈ దిశగా కృషిచేస్తోంది. స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన పదిహేను గంటల వ్యవధిలో కేప్‌కెనావెరల్‌ నుంచి టర్కీకోసం హైపవర్‌ జియోస్టేషనరీ కమ్యూనికేషన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఒకేరోజు, ఒకే వేదికపై నుంచి రెండు ఫాల్కన్‌-9 రాకెట్లను ప్రయోగించడం స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరోఘనత. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 20 దేశాలలో లక్ష మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్‌లకు సేవలు అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని స్పేస్‌ఎక్స్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా స్పేస్‌ఎక్స్‌ 98వ విజయవంతమైన ల్యాండింగ్‌ ఇది. 2021లో ఫాల్కన్‌-9 చేపట్టిన 29వ మిషన్‌ ఇది. గతేడాది 26 మిషన్‌లు చేపట్టిన ఫాల్కన్‌-9 ఈసారి ఆ రికార్డును తిరగరాసింది. రానున్న పది రోజుల వ్యవధిలో మరో రెండు మిషన్‌లను చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి పూర్తయితే ఒక ఏడాదిలో గరిష్ట మిషన్ల సంఖ్య 31కి చేరుతుందని సంస్థ ప్రకటించింది. ఈ ప్రయోగంతో మే 2019 నుంచి ప్రారంభించబడిన స్టార్‌లింక్‌ ఉపగ్రహాల మొత్తం సంఖ్య 1944కి చేరింది. మంగళవారం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్‌ 39ఎ నుంచి నాసా కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డ్రాగన్‌ కార్గొషిప్‌ను మోసుకెళ్లే మరో ఫాల్కన్‌ రాకెట్‌ను స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement