Saturday, April 27, 2024

సరూర్‌నగర్ ఘటనపై దిగ్భ్రాంతి.. జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి ఘటన

 
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జాతీయస్థాయిలో తనను తాను ఓ విజయవంతమైన నేతగా చిత్రీకరించుకునే ప్రయత్నాల్లో మునిగితేలుతున్న తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు, పట్టపగలే నడిరోడ్డుపై ఓ దళిత యువకుణ్ణి ఇనుప రాడ్లతో కొట్టి చంపుతుంటే మౌనం వహించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్ చెప్పినట్టుగా నడచుకునే పనిముట్లుగా మారొద్దని, ఇకనైనా ప్రజల కోసం పనిచేయాలని చుగ్ హితవు పలికారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన దారుణ హత్యాకాండపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దళితబంధు అంటూ దళితులను మోసగిస్తున్న కేసీఆర్ సీఎం కేసీఆర్, ఇప్పుడు నడిరోడ్డుపై ఓ దళిత యువకుణ్ణి కొట్టిచంపుతుంటే మౌనం వహించారని మండిపడ్డారు.
 
అంతకు ముందు “ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకుణ్ణి కొట్టి చంపారు” అంటూ తరుణ్ చుగ్ చేసిన ట్వీట్‌పై జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సాంప్లా స్పందించారు. ట్విట్టర్ వేదికగానే స్పందించిన సాంప్లా, ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాల్సిందిగా తెలంగాణ పోలీసు యంత్రాగాన్ని ఆదేశించారు. వెనువెంటనే స్పందించిన విజయ్ సాంప్లాకు కృతజ్ఞతలు చెబుతూ తరుణ్ చుగ్ మరో ట్వీట్ చేశారు. అనంతరం ఈ అంశాలపై మీడియాకు వివరాలు వెల్లడిస్తూ తెలంగాణలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని ఆరోపించారు. ఓటుబ్యాంకు కోసం సీఎం కేసీఆర్ కొన్ని ఘటనలపై చర్యలు తీసుకోవడం లేదని, కనీసం నోరుమెదపడం లేదని విమర్శించారు. ఎవరిని సంతోషపెట్టడం కోసం ఈ మౌనం వహించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దోషులు బహిరంగంగా తిరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తరుణ్ చుగ్ అన్నారు. ఈ ఘటన దళితుల అధికారాలపై, రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో మానవ హక్కులు ఎక్కడికక్కడ ఉల్లంఘనకు గురవుతున్నాయని, పూర్తిగా ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు.
 
హర్యానాలో పోలీసులకు దొరికిన ఖలిస్తానీ ఉగ్రవాదుల ఘటనకు తెలంగాణ రాష్ట్రంతో సంబంధాలపై తరుణ్ చుగ్ స్పందించారు. ఆర్డీఎక్స్ వంటి మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు, ఐఈడీ బాంబులను తెలంగాణకు తరలిస్తుంటే ఆ రాష్ట్ర నిఘా విభాగం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు ఉగ్రవాద కార్యాకలాపాలకు కూడా తెలంగాణ అడ్డాగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement