Thursday, April 25, 2024

వణికిస్తున్న చలి.. ప్రజలపై వ్యాధుల దాడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని చలి గజగజా వణికిస్తోంది. సాయంత్రం 5 నుంచి ఉదయం 9గంటల వరకు చలి పులాలా విరుచుకుపడుతోంది. చలి దాటికి జనాలు గజగజా వణుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి తోడు చల్లటి ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో వైరల్‌ ఫీవర్‌ బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు.చిన్నారులు న్యూమోనియాకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చలితీవ్రతతో వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎముకలు కొరికే చలితో రక్తం గడ్డం కట్టే పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో దగ్గు, జలుబుతోపాటు ఫ్లూ ఇన్‌ ఫెక్షన్లు చలికాలంలో సులువగా వ్యాప్తి చెందుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు రకాల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులూ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చలి కారణంగా ఎముకల్లో నొప్పి, ఎముకలు, కీళ్ల పనితీరులో సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి తరుచూ శీతాకాలంలో వేధిస్తుందని, వృద్ధులను ఈ సమస్య ఎక్కువగా భాదిస్తుందని, గోరువెచ్చని నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమాతో బాధపడేవారు శీతాకాలంలో అత్యంత జాగ్రత్తతో ఉండాలని శ్వాసకోశ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గొంతు నొప్పి, దగ్గు, ఛాతి బిగుతు వంటి సమస్యలతో ప్రారంభమై ఉబ్బసం వ్యాధికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఇన్హేలర్‌ దగ్గరగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. శీతాకాలంలో గుండెజబ్బులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని, రక్తపోటు పెరిగి గుండెపు అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని, ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement