Saturday, April 27, 2024

అమెరికాకు షిగెల్లా ముప్పు! ఔషధాలకూ లొంగని బ్యాక్టీరియా

కొవిడ్‌ చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అగ్రరాజ్యం అమెరికాను మరొక కొత్త బ్యాక్టీరియా హడలెత్తిస్తోంది. షిగెల్లా బ్యాక్టీరియా అక్కడ తీవ్రమైన ముప్పుగా మారింది. ఔషధాలకు లొంగని ఈ బ్యాక్టీరియాపై అమెరికా వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గత కొద్దిరోజులుగా షిగెల్లా కేసులు పెరుగుతున్నాయి. బ్యాక్టీరియా వ్యాప్తి భయానక స్థితికి చేరుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిని తీవ్రమైన ప్రజారోగ్య ముప్పుగా పేర్కొంటున్నారు. దేశంలో షిగెల్లా ముప్పు గురించి అమెరికా జాతీయ ప్రజారోగ్య సంస్థ హెచ్చరిక జారీచేసింది. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఒక ప్రకటనలో షిగెల్లా పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.

బీబీసీ ప్రకారం, ఔషధ నిరోధక ఈ బ్యాక్టీరియా వేలాది మంది అమెరికన్లను అనారోగ్యానికి గురిచేసింది. షిగెల్లా బ్యాక్టీరియా ప్రభావం వల్ల జ్వరం, విరేచనాలు, కడుపు నొప్పి వస్తుందని వైద్యులు తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌కు మందులతో సులభంగా చికిత్స చేయడం సాధ్యంకాదు. కాబట్టి అధికారులు దీనిని తీవ్రమైన ఆరోగ్య ముప్పుగా పిలుస్తున్నారు. 2015లో నమోదై ఇన్‌ఫెక్షన్లలో ఏ ఒక్కటీ షిగెల్లా జాతికి సంబంధించినది కానప్పటికీ, 2022లో దీనికి సంబంధించిన కేసులు 5శాతం నమోదయ్యాయి. 2019లో అమెరికా మొత్తం ఇన్‌ఫెక్షన్లలో షిగెల్లా ప్రభావం 1శాతానికి చేరింది. సాధారణ చికిత్సకు ఉపయోగించే ఐదు రకాల యాంటీ బయాటిక్‌లను షిగెల్లా నిరోధిస్తుంది.

- Advertisement -

సీడీసీ నివేదిక ప్రకారం, ప్రతి ఏటా ఈ బ్యాక్టీరియా కారణంగా 4.5 లక్షల మంది అస్వస్థులవుతుంటారు. 93 మిలియన్‌ డాలర్ల వైద్య ఖర్చులకు కారణం అవుతుంది. మందులకూ లొంగని ఈ బ్యాక్టీరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీడీఎస్‌ సూచిస్తోంది. కలుషిత ఆహారం లేదా అపరిశుభ్ర నీటిని తాగడం వల్ల షిగెల్లా బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. లైంగిక సంపర్కం, మల-నోటి మార్గం గుండానూ వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 5-7 రోజుల్లోనే వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement