Sunday, April 28, 2024

Big story | ప్రకృతి అందాలకు ప్రతీక శనిగరం చెరువు.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మిషన్‌ కాకతీయలో పునరుద్ధరించిన చెరువులను పర్యాటకప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. జిల్లాల్లోని ప్రాచీన చరిత్ర ఉన్న చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రధానంగా సిద్ధిపేట నియోజకవర్గంలోని చెరువులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా శనిగరం చెరువు సుందరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాకతీయుల అనంతరం రాష్ట్రాన్ని పాలించిన రాజులు చెరువుల నిర్మాణంలో కాకతీయుల బాటలోనే ప్రయాణించారు. ప్రజలకు జీవనోపాధి, పాలకులకు ఆదాయమార్గాలు ఉండటంతో అడవులను నరికించి చెరువును నిర్మించారు. చెరువును ఆధారంగా చేసుకుని వ్యవసాయంతో పాటుగా కులవృత్తులను ప్రోత్సహిస్తూ తటాకాల నిర్మాణాలు చేపట్టారు.

- Advertisement -

ప్రధానంగా తెంలగాణ ప్రాంతం ఎత్తులో ఉండటంతోపాటుగా సముద్రం లేకపోవడంతో చెరువులు, బావులు, కాలువలు, ఊట చెలిమెలు వ్యవసాయానికి సాగునీరు అందించేవి. ఈ నేపథ్యంలో సిద్ధిపేటలో కుతుబ్‌ షాహీ రాజులు నిర్మించిన శనిగరం చెరువు ఆనాటి ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి అద్దంపడుతుంది. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని హెడ్‌రెగ్యులేటరీ వర్క్‌తో పాటుగా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని తోడే విధానంతో కుతుబ్‌ షాహీ రాజులు శనిగరం చెరువును నిర్మించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని శనిగరం గ్రామంలో శనిగరం నదికి అడ్డంగా నిర్మించిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు. నది ఉపరితలం నుంచి 16మీటర్ల ఎత్తు 908 మీటర్ల పొడవున ఈ చెరువు విస్తరించింది. 14వేల 150 క్యూసెక్కుల సామర్థ్యంతో సుమారు 2టీఎంసీల నీటి నిల్వకోసం శనిగరం చెరువును కులీకుతుబ్‌ షాహీలు నిర్మించారు.


శ్రీరామ్‌ సాగర్‌ రెండవ దశ పనుల్లో భాగంగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి లిఫ్ట్‌ కెనాల్‌ ద్వారా ఈ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తూ వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. శనిగరం రిజర్వాయర్‌ పరిసరాల్లో ప్రాచీన నగరాల ఆనవాళ్లు ఉన్నట్లు చరిత్రకారులు ఆధారాలతో ముందుకు వస్తున్నారు. నదీ పరివాహకప్రాంతాలు, జల సముదాయాల్లో ప్రాచీన నగరాలు ఉన్నట్లుగానే ఇక్కడ నగరం ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అనేక రాజవంశాల ఏలుబడిలో శనిగరం ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణ జీవనవిధానాలు చెరువు కేంద్రంగానే విరాజిల్లినట్లు అనేక ఆధారాలు లభ్యమవుతున్న నేపథ్యంలో శనిగరం కూడా ఒకప్పటి ప్రాచీననగరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

అయితే శనిగరం చెరువును కుతుబ్‌ షాహీలు నిర్మించారా?, అప్పటికే నిర్మించిన చెరువును పునరుద్ధరించారనే ఆధారాలపై చరిత్రకారులు దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న శాసనాధారం మేరకు సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌షాహీ ఆనతి మేరకు సయ్యద్‌ ముజఫర్‌ సిద్దిపేటలోని శనిగరంలో ఒకపెద్ద చెరువును నిర్మించినట్లు శనిగరం శాసనం చెపుతుంది. ఈ చెరువు నిర్మాణానికి 540 కిలోల బంగారాన్ని కుతుబ్‌ షాహీ మంజూరు చేసినట్లు క్రీ.శ. 1664 నాటి శాసనం చెపుతుంది. సుదీర్ఘ చరిత్ర ను సొంతం చేసుకున్న శనిగరం చెరువు ఇప్పటికీ సాగునీరు అందిస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పర్యాటకలను ఆకట్టుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement