Saturday, May 4, 2024

24న విత్తన మేళా.. ఎనిమిది పంటలకు చెందిన 44 రకాల సీడ్స్​ అందుబాటులో..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 24న విత్తనమేళా జరగనుంది. విత్తన మేళాలో మొత్తం ఎనిమిది పంటలకు సంబంధించిన 44 రకాల వంగడాలను అందుబాటులో ఉంచుతామని వర్సీటీ వీసీ డాక్టర్‌ వి. ప్రవీణ్‌ రావు తెలిపారు. మేళా నిర్వహణకు సంబంధించి రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలతో పాటు ఉద్యాన విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి పరిధిలోని వరి పరిశోధన కేంద్రం, నూనె గింజల పరిశోధన సంస్థ రూపొందించిన వంగడాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు.

వివిధ వంగడాలకు సంబంధించి సుమారు 15 వేల కింటాళ్ళ విత్తనాలను ఈ మేళా ద్వారా విక్రయిస్తామని ఆయన తెలిపారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం (నాగర్‌ కర్నూల్‌ జిల్లా), జగిత్యాల, వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, ఇతర వ్యవసాయ పరిశోధన స్థానాల్లోనూ విత్తనమేళాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విత్తనా మేళా కార్యక్రమంలో భాగంగా వివిధ పంటల యాజమాన్య పద్దతులు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణపై రైతులకు శాస్తవేత్తలు అవగాహన కల్పిస్తారని ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement