Thursday, May 2, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జ‌రిగింది : బండి సంజయ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని… అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం స్రుష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి. బీజేపీని పదేపదే అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తారు.. హైదరాబాద్ లో మా తడాఖా చూపిస్తామని ముందే కాంగ్రెసోళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం స్రుష్టించారు. పోలీసులకు సమాచారం ఉన్నా ముందస్తుగా అరెస్ట్ చేయరు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి.. బీజేపీని డామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ నీచమైన కుట్రకు తెరదీసిండన్నారు. అగ్నిపథ్ ఒక గొప్ప పథకం… 17.5 సంవత్సరాల నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు అగ్నిపథ్ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటే కొద్ది మందిని మాత్రమే సెలెక్ట్ చేసేవాళ్లు. కానీ ఇకపైమ దరఖాస్తు చేసుకున్న వారందరినీ దాదాపు అగ్నివీరులుగా గుర్తించి 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. తొలి ఏడాది 30 వేల నుండి జీతం మొదలవుతుంది. నాలుగేళ్లపాటు అగ్నివీరులుగా కొనసాగే అవకాశం వచ్చిండన్నారు
అట్లాగే జీతంలో 70 శాతం నగదు అగ్ని వీరులకు అందజేస్తారు.. మిగిలిన మొత్తం కార్పస్ ఫండ్ కు జమ అవుతుంది. నాలుగేళ్ల తరువాత వంద మందిలో 25 శాతం మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకుంటారు. మిగిలిన వాళ్లకు కార్పస్ ఫండ్ పేరిట 5 లక్షలతోపాటు కేంద్రం మరో 5 లక్షలు, మరో లక్ష వడ్డీ కలిపి మొత్తం 11 లక్షల రూపాయలు అందజేస్తారు. అట్లాగే ఇకపై జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కోటాను ప్రకటించారు. 4 ఏళ్లపాటు ఉద్యోగం చేసే సమయంలో 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. దీనికితోడు అదనంగా మరో 44 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తోంది. ఈ సర్వీసులో అంగవైకల్యం కలిగితే కూడా పరిహారం అందజేస్తుందని తెలిపారు. ఇంత గొప్ప స్కీం అగ్నిపథ్.. నిరుద్యోగిగా ఉంటే ఏం వస్తది? ఆర్మీలో పనిచేస్తే గౌరవం, దేశభక్తి పెరుగుతుంది. అగ్నిపథ్ లాంటి పథకాలు చాలా దేశాల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహలుంటే నివ్రుత్తి చేసుకోవాలే తప్ప విధ్వంసాలు పాల్పడమేంది?. ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement