Wednesday, May 15, 2024

రష్యా వ్యూహాత్మక అడుగు, వెనక్కి వెళ్తూనే.. దాడులు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. బలగాలను ఉప సంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సరిహద్దులు, చెర్నిహివ్‌లోని జనావాసాలపై క్షిపణులతో విరుచుకుపడుతూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇంకా ముగిసిపోలేదని అర్థం అవుతున్నది. 38వ రోజు శనివారం కూడా దాడులు కొనసాగాయి. రష్యా సేనలు ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యన్‌ ఆర్మీ భారీ విధంసాన్నే సృష్టించాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌ ఆర్మీతో పాటు సాధారణ పౌరులు వేలల్లో మృతి చెందారు. రష్యా ఆర్మీని ఉక్రెయిన్‌ బలగాలు ధైర్యంగా అడ్డుకుంటున్నాయి. ఈ యుద్ధంలో 17,800 మంది రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్‌ ఆర్మీ ప్రకటించింది. దీంతో పాటు 631 యుద్ధ ట్యాంకులు, 1776 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. 143 యుద్ధ విమానాలు, 132 హెలికాప్టర్లు, 87 యూఏవీలను నేలకూల్చినట్టు ప్రకటించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వయస్థలను నాశనం చేసినట్టు తెలిపింది. మరియుపోల్‌లో రష్యా దాడుల కారణంగా.. దాదాపు 10 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది.

రష్యా.. వ్యూహాత్మక వెనుకడుగు..

తాజా ఉక్రెయిన్‌తో చర్చల అనంతరం.. రష్యా తన సేనలను వెనక్కి తీసుకుంటున్నది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాల నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోతుండటం కూడా శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వెనుకడుగు వ్యూహాత్మకమేనా.. రష్యా తిరిగి విరుచుకుపడుతుందా… అని ఉక్రెయిన్‌ అనుమానిస్తున్నది. ఏది ఏమైనా.. ఈ పరిణామంతో.. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ ఉక్రెయిన్‌ మాత్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. వేస్తున్న వెనుకడుగు.. మళ్లి రెట్టింపు దాడులు చేసేందుకే అని అనుమానిస్తున్నది. ఇంత సునాయసంగా రష్యా బలగాలు వెనక్కి వెళ్లడం కూడా ఉక్రెయిన్‌కు మింగుడుపడటం లేదు. ఉక్రెయిన్‌పై గెలుపు కోసం రష్యా ఎంతో ఉవ్విళ్లూరుతున్నదని, అప్రమత్తంగానే ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మే 9వ తేదీ రష్యా విక్టరీ డే పేరుతో సంబరాలు చేసుకుంటుంది. ఇంకా సమయం పొంచి ఉందని, ఆలోపు ఏదైనా జరగొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

రష్యాపై జెలెన్‌ స్కీ ఆగ్రహం..

తన బలగాలను వెనక్కి తీసుకుట్టున్నట్టు రష్యా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ దిశగా పుతిన్‌ ఆర్మీ అడుగులు వేస్తున్నది. అయితే ఇది పుతిన్‌ వ్యూహాత్మక వెనుకడుగు అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ విమర్శించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాల మాటున ల్యాండ్‌మైన్లు పెడుతున్నదని విమర్శించారు. బలగాల ఉప సంహరణ మాటున.. ఉక్రెయిన్‌ ఆర్మీని అంతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తమ దాడుల్లో చనిపోయిన ఉక్రెయిన్‌ పౌరుల శవాల కింద ల్యాండ్‌ మైన్లను రష్యా సైనికులు పెట్టి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. దాడుల్లో శిథిలమైన ఇళ్లలోనూ రష్యా సైనికులు ల్యాండ్‌ మైన్లు ఉంచి వెళ్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వచ్చే విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. సైన్యం ప్రకటన చేసే దాకా ప్రజలు వేచి చూడాలని జెలెన్‌ స్కీ పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement