Thursday, May 2, 2024

Politics: రూ.40కోట్ల ఆఫర్​.. గోవా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు బీజేపీ వల!

బీజేపీలో చేరడానికి తమ ​ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.40 కోట్లు ఆఫర్ చేశారని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ నేతృత్వంలోని కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ పార్టీ లో చేరే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ఆ పార్టీ లీడర్లు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగుబాటుపై  ముందస్తు చర్యలు తీసుకున్నారు.  పారిశ్రామికవేత్తలు, బొగ్గు మాఫియా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్స్ వస్తున్నాయని, ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు దినేష్ గుండూరావుకు చెప్పారని చోడంకర్ పేర్కొన్నారు.

అయితే.. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తుందనే నిరాధార ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ తనవడే ఖండించారు. అవన్నీ ఉత్త మాటలే అన్నారు. కాంగ్రెస్‌లో గందరగోళానికి గోవా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.  

పార్టీలో చీలిక ఉందన్న వార్తలను రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ.. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పుకార్లను పెంచుతూ ఈ ఉదయం పార్టీ సమావేశానికి, సాయంత్రం విలేకరుల సమావేశానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఈ నెలాఖరు నాటికి 30 మంది ఎమ్మెల్యేలు చేరుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సీటీ రవి చెప్పడంతో మే నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement