Thursday, May 9, 2024

TS | 11 రోజుల్లోనే రూ.243కోట్ల ప‌ట్టివేత‌.. విస్తుబోతున్న ఈసీ వ‌ర్గాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రలోభాలు, నగదు తరలింపు పరంపర జోరుగా కొనసాగుతోంది. గురువారం ఉదయం నాటికే పోలీసులు పలు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న అన్నింటి విలువ రూ. 243కోట్లకు చేరింది. మొత్తంగా రూ.243,76,19,296 కోట్లతో పోలీసులు, ఈసీ సాక్షాత్తూ విస్తుపోయేలా స్వాధీనాల జోరు కొనసాగుతోంది. ఇక నామినేషన్ల ఘట్టం, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత మొత్తం స్వాధీనం చేసుకుంటారో చూద్దామని కేంద్ర ఎన్నికల సంఘమే తెలంగాణపై ఉత్సుకతతో ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

రాష్ట్రమంతటా చెక్‌పోస్టులకు తోడు ఎక్కడికక్కడ పోలీసులు బారీకేడ్‌లు ఏర్పాటు చేసి చేస్తున్న తనిఖీలతో సామాన్యులు, అత్యవసర పనులమీద వెళ్తున్న ప్రజలకు ఇబ్బందులైతే తప్పడంలేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జరుగుతున్న తనిఖీల్లో అత్యవసరాలు, వ్యాపారం కోసం తీసుకెళ్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజువారీ లావాదేవీలు, బ్యాంకులకు వెళ్తున్న సమయంలోనూ తమ వద్ద ఉన్న నగదు స్వాధీనం చేసుకుంటున్నారని మద్యం దుకాణదారులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

తాజాగా ఆభరణాలు అన్నింటికీ రసీదులు ఉండబోవని, వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం వల్ల తమ ఉపాధి దెబ్బ తింటున్నదని స్వర్ణకారుల సంఘం వాపోతోంది. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వల్పకాలంలోనే స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పెద్ద మొత్తంలో పెరిగాయని ఈసీ మరింత నిఘా పెడుతోంది. ఈ క్రమంలోనే గత ఫిర్యాదులు, తాము ఉర్తించి అంశాల ఆధారంగానే కాకుండా ఇంకా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర అధికారులను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసింది.

- Advertisement -

అనంతర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆదేశాలనివ్వడంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే తనిఖీలు ప్రారంభించారు. సరిహద్దుల్లో 148 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.

భారీ ఎత్తున నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుబడుతోంది. స్వాధీనం అయిన సొత్తు మొత్తం ఇప్పటికే గత ఎన్నికలను అధిగమించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 87కోట్ల 92 లక్షలుకాగా, అక్రమ సరఫరా ద్వారా పట్టుబడిన మద్యం 65223 లీటర్లు. 18,874 కిలోల నల్ల బెల్లం, 655 కిలోల ఆలం కాగా.. వాటి విలువ రూ.10.21కోట్లు. రూ.7.72 కోట్ల విలువైన 2950 కిలోల గంజాయి పట్టుబడింది. సరైన ఆధారాలు, పత్రాలు, వివరాలు లేని 181 కిలోల బంగారు, 693 కిలోల వెండి, 154 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలువ రూ.120 కోట్ల 40 లక్షలకు పైగా ఉంది. వీటితో పాటు రూ.17.48 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి, బియ్యం మొదలైన వస్తువులు పటుబడ్డాయి ఆభరణాలునగదు, అన్ని వస్తువులు కలిపితే ఇప్పటి వరకు స్వాధీనం అయిన మొత్తం సొత్తు విలువ రూ.243 కోట్ల 76 లక్షల 19 వేల 296. ఇది గత శాసనసభ ఎన్నికల రికార్డును అధిగమించింది.

2018 ఎన్నికల సమయంలో రూ.97 కోట్ల నగదు, 2.3 కోట్ల విలువైన మద్యం, రూ.42 లక్షల విలువైన మత్తు పదార్థాలు, 3.2 కోట్ల బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరో 34 కోట్ల విలువైన ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నగదు, అన్ని వస్తువులను కలిపితే 2018 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.137 కోట్ల 97 లక్షలు మాత్రమే. అప్పుడు ఎన్నికల ప్రక్రియ మొత్తంలో స్వాధీనం అయిన మొత్తం కంటే.. ఈ దఫాలో షెడ్యూల్‌ నుంచి పరకొండు రోజుల్లోనే అంతకు మించిన మొత్తం పట్టు-బడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement