Monday, April 29, 2024

పర్యాటకానికి ‘రోప్‌వే’ హంగులు.. 26 చోట్ల ఏర్పాటుకు నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం చేపట్టనున్నారు. చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోప్‌వేల నిర్మాణంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీటీడీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ ప్రాజెక్టులో భాగంగా రోప్‌వేల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జాతీయ రహదార్ల అభివృద్ధి సంస్థకు అనుబంధమైన నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌) సంస్థతో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 26 పర్యాటక ప్రాంతాలు రోప్‌వేల నిర్మాణానికి అనువైనవిగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా.. మరో ఆరు డీపీఆర్‌ తయారీ దశలో ఉన్నాయి. మిగిలిన వాటిని దశలవారీగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి పర్వతమాల ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు చెపుతున్నారు. కోవిడ్‌-19 తదనంతరం పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గి ఆదాయం కుంటుపడింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా ఉన్న ఏపీ కూడా భారీగా నష్టపోయింది. గత రెండేళ్లుగా పడకేసిన పర్యాటకాన్ని పట్టాలెక్కించేందుకు అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగమే పర్వతమాల ప్రాజెక్టులోని రోప్‌వేల నిర్మాణంపై ఏపీటీడీసీ ఆసక్తి చూపడానికి కారణం. రోప్‌వేల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక శోభ వెల్లివిరుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా త్వరితగతిన రోప్‌వేల నిర్మాణానికి చర్యలు చేపట్టారు.

మారుతున్న అభిరుచులకు అనుగుణంగా..

గతంతో పోలిస్తే పర్యాటకుల అభిరుచుల్లో మార్పులు వచ్చినట్లు అధికారులు చెపుతున్నారు. మొక్కబడిగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి కొంత సమయం గడపడం కంటే సాహాస పర్యాటకాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ట్రెక్కింగ్‌, కొండగుట్టల్లో ప్రకృతిని ఆస్వాదించేందుకు ఎక్కువ మంది పర్యాటకులు ఇష్టపడుతున్నారు. పర్వత ప్రాంతాల్లో పర్యాటకులు మరింత అనుభూతి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సైతం భిన్నత్వం కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లోని విశేషాలను తెలుసుకునేందుకు కూడా వీరు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకుల అభిరుచులకు అనుగుణంగా సౌకర్యాలు కలిపించిన పక్షంలో పర్యాటకుల సంఖ్య పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పర్వతమాల కింద జాతీయ రోప్‌వే పథకాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీటీడీసీ అధికారులు ముమ్మర కార్యాచరణ చేపట్టారు. ఈ క్రమంలోనే రోప్‌వేల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు.

రెండు డీపీఆర్‌లు సిద్ధం..

రాష్ట్రవ్యాప్తంగా 26 పర్యాటక ప్రాంతాలు రోప్‌వేల నిర్మాణానికి అనువైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ పైభాగం నుంచి ఆలయం వరకు, తెలంగాణ-శ్రీశైలం మధ్య కృష్ణానదిపై ఈగలపెంట వద్ద రోప్‌వే ఏర్పాటుకు డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపారు. ఇదే సమయంలో గండికోట, శ్రీకాళహస్తి, గాలికొండ వ్యూపాయింట్‌ నుంచి కటిక జలపాతం వరకు, లంబసింగి, అన్నవరం, గగన్‌మహాల్‌ నుంచి పెనుగొండ గుహల వరకు డీపీఆర్‌లు రూపొందించడం పురోగతిలో ఉంది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణంపై దృష్టిసారించనున్నారు.

- Advertisement -

మంచి అవకాశం..

పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం ఒక మంచి అవకాశంగా ఏపీటీడీసీ ఎండీ కే.కన్నబాబు తెలిపారు. పర్వతమాల ప్రాజెక్టు కింద రోప్‌వేల నిర్మాణానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సువర్ణ అవకాశంగా భావిస్తున్నామన్నారు. పర్యాటకులు సాహసంతో కూడిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకుల సంఖ్య పెంపుకు రోప్‌వేల నిర్మాణం దోహదపడుతుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement