Wednesday, May 8, 2024

తెలంగాణలో రాకెట్‌ డిజైన్‌ & తయారీ కేంద్రం.. ప్రతిపాదించిన స్కై రూట్‌ కంపెనీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్‌ కంపెనీ స్కై రూట్‌ ఏరోస్పేస్‌కు హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన అభినందన సభలో కేటీఆర్‌ ఈ మేరకు ప్రకటించారు. హైదరాబాద్‌ కేంద్రంగా తమ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే వియవంతంగా రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సష్టించిందని భవిష్యత్తులో తెలంగాణ కేంద్రంగానే ముందుకు వెళ్లే ప్రణాళిక తమ కంపెనీకి ఉందని స్కై రూట్‌ యాజమాన్య ప్రతినిధులు తెలిపింది. తెలంగాణలో సమీకృత రాకెట్‌ డిజైన్‌ తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను స్కై రూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీ కోరింది.

ముందు నుంచి స్కై రూట్‌ లాంటి కంపెనీలకు మద్దతివ్వడం తమకు గర్వకారణమని కేటీఆర్‌ తెలిపారు. స్కై రూట్‌ ప్రతిపాదిస్తున్న సమీకృత రాకెట్‌ డిజైన్‌, తయారీ పరీక్షా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్కై రూట్‌ సక్సెస్‌తో హైదరాబాద్‌ టీ హబ్‌ పేరు మరోసారి మారుమోగిందని కేటీఆర్‌ అన్నారు. ఇందుకుగాను ఆకంపెనీకి అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన స్కై రూట్‌కు హైదరాబాద్‌ వేదిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. తొలి ప్రయత్నంనలోనే స్కై రూట్‌ విజయవంతంగా రాకెట్‌ను పంపించడం చిన్న విషయం కాదన్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మరో స్టార్టప్‌ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేయబోతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్పేస్‌ టెక్‌ పాలసీతో ఇక్కడే రాకెట్‌లు తయారు చేసి ప్రయోగించేందుకు అన్ని అనుకూలతలు న్నాయన్నారు. ఒక అద్భుతమైన ఆలోచనకు ఊతం ఇచ్చేలా టీ హబ్‌, టీ వర్క్స్‌ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్న స్కై రూట్‌ యాజమాన్యం తమ ప్రస్థానంలో రెండింటి పాత్ర మరువలేనిదన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు స్కై రూట్‌ కంపెనీ ప్రతినిధి ధన్యవాదాలు తెలిపారు. 200 మంది స్కై రూట్‌ సిబ్బంది కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా తమ కంపెనీ భవిష్యత్తులో కార్యకలాపాలను విస్తరిస్తుందని చెప్పారు. స్కై రూట్‌ అభినందన సభలో కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement