Monday, May 6, 2024

కొలనూర్‌లో ఆర్వోబీ మంజూరు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బలార్షా సెక్షన్‌లోని కొలనూర్‌ రైల్వే గేటు వద్ద రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరైంది. కొలనూర్‌లోని రైల్వే గేటు వద్ద ఆర్వోబీ లేని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయంపై ద.మ.రైల్వేకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ రైల్వే గేట్‌పై ప్రతీ రోజూ నిర్విరామంగా అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఇక్కడ ఆర్వోబీ లేకపోవడంతో ప్రజలు 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తున్నది. 1982 మార్చి వరకు ఈ మార్గం డబుల్‌ లైన్‌గా ఉన్నప్పటికీ ఇనుప గొలుసుతో రోడ్డు ప్రయాణాన్ని రైళ్ల రాకపోకలకు అనుగుణంగా నియంత్రించే వారు.

1982 మార్చిలో తిరువనంతపురం న్యూఢిల్లి జయంతి జనతా ఎక్స్‌ప్రె స్‌ ఇదే లెవల్‌ క్రాసింగ్‌పై ఓ ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సును ఢీకొనడంతో దాదాపు 62 మంది మృత్యువాతపడ్డారు. అప్పుడు లిఫ్టింగ్‌ బారియర్‌తో కొత్త గేటు ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పద్దతిలో రోడ్డు ప్రయాణాన్ని నియంత్రిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను డి.రాంచందర్‌రావు అనే వ్యక్తి ద.మ.రైల్వే అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురాగా స్పందించిన అధికారులు కొలనూరులో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు అడిషనల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ రాజీవ్‌ కుమార్‌ రాంచందర్‌రావుకు సమాచారాన్ని మెయిల్‌ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement