Thursday, May 2, 2024

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది దుర్మరణం

కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్నలారీని వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమమంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు చిన్నారులు మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో బాధితుల వివరాలు తెలియడంలేదు. వారి వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ఆజ్మీర్‌ వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడా? లేక టెంపో వాహనం టైరు పేలి ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement