Tuesday, April 30, 2024

కొవిడ్ ఆంక్షలు.. అతిక్రమిస్తే చర్యలు..

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.  హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  అంతేకాదు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టల్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  ఖచ్చితంగా మాస్క్ లు, భౌతిక దూరం పాటించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  

అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, ఈనెల 28, 29 తేదీల్లో హోలీ పండుగను జరుపుకోబోతున్నారు. అయితే, కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో అనేక రాష్ట్రాలు హోలీ వేడుకలకు అనుమతించడం లేదు. మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హోలీని నిషేధించారు. మహారాష్ట్రలో ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిషేధం ఉంది. 20 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement