Wednesday, May 15, 2024

రష్యా చమురుకు రిలయన్స్‌ నో.. ప్రపంచ దేశాల ఆంక్షలే కారణం..

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రిఫైనరీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రష్యా చమురు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురును కొనుగోలు చేయబోమని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించాయి. రష్యాపై ఆంక్షల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రిలయన్స్‌ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉన్న ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా దూరంగా ఉండనున్నామని..కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ రావత్‌ తెలిపారు. కాగా రిలయన్స్‌ కొన్నేళ్లుగా తమ రిఫైనరీ కేంద్రాల కోసం రష్యా నుంచి ఉరల్స్‌ క్రూడ్‌తోపాటు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అదేవిధంగా అమెరికా నుంచి పెట్రో కెమికల్‌ ఫీడ్‌స్టాక్‌ను కొనుగోలు చేస్తోంది.

అయితే ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా భారత్‌కు ధర తగ్గించి సరఫరా చేసేందుకు అంగీకరించింది. దీంతో ఆ దేశం నుంచి 30లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్‌ చౌకధరకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు కొనుగోలుకు సంబంధించి భారతదేశమే తొలిసారి ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement