Saturday, May 4, 2024

Delhi | సన్‌ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్‌ దిగుమతి సుంకం తగ్గింపు.. తగ్గనున్న వంట నూనెల ధరలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నానాటికీ పెరిగిపోతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వంట నూనెల విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున శుద్ధి చేసిన సోయాబీన్ నూనె, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ రెండు నూనెల ధరలు తగ్గనున్నాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

గురువారం నుంచే అమల్లోకి వచ్చేలా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఈ మేరకు కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా ఇప్పటి వరకు 17.5 శాతం ఉన్న దిగుమతి సుంకం 12.5 శాతానికి తగ్గనుంది. 2021 అక్టోబర్ నెలలో చివరిసారిగా దిగుమతి సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించింది. అప్పుడు 32.5% నుండి 17.5%కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా మరో 5 శాతం తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి సుంకం తగ్గింపు కారణంగా పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతాయని, తద్వారా వినియోగదారులకు తగ్గింపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది.

వంట నూనె ధరలను ప్రభావితం చేసే అంశాల్లో దిగుమతి సుంకం ఒకటని, అంతర్జాతీ మార్కెట్లో పెరిగిన డిమాండ్ దృష్ట్యా వంట నూనెల ధరలు పెరుగుతున్నందున దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలని కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. మరోవైపు దేశంలో తగినంత మేర వంటనూనెల నిల్వలు ఉండేలా కూడా ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement