Friday, May 10, 2024

Delhi | రక్షిత వృక్ష జాతుల జాబితాలో ఎర్రచందనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం వృక్షాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వృక్ష జాతిగా ప్రకటించడంతో పాటు ఎర్రచందనం సహా అరుదైన చెట్లున్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడిక జాబితాలో ఎర్ర చందనంను చేర్చిన కారణంగా ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుందని అన్నారు.

సెట్స్ (కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డెంజరస్ స్పీసెస్) స్టాండింగ్ కమిటీ ఇండియాకు చెందిన ఎర్రచందనం (ప్టెరోకార్పస్ శాంటాలినస్)ను ముఖ్యమైన వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ వాసుల జీవనోపాధి, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి అవకాశాలు, ఆదాయ  మార్గాల సృష్టి, ఉత్పాదకత మెరుగుపరచడానికి పరిపూర్ణమైన, సమగ్ర పద్ధతిలో చెట్ల పెంపకాన్ని విస్తరించే లక్ష్యంతో  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించే విధంగా  కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆగ్రోఫారెస్ట్రీలో బాగంగా ఎర్రచందనం, టేకు వంటి వృక్ష జాతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

ఎర్రచందనం పంటకు సంబంధించి నాన్ డెట్రిమెంటల్ ఫైండింగ్స్ కూడా మంత్రిత్వ శాఖ చేపట్టిందని, కృత్రిమంగా సాగుచేసే ఎర్రచందనం వార్షిక ఎగుమతి పరిమాణాన్ని సూచించినట్లు తెలిపారు. కృత్రిమ సాగు ద్వారా మూలం నుంచి సేకరించిన ఎర్రచందనం ఎగుమతి చేయడం వలన రైతుల జీవనోపాధిని ప్రోత్సహించవచ్చని అన్నారు. ముఖ్యమైన వాణిజ్య సమీక్ష కింద ఇండియాకు సంబంధించి కొన్ని వృక్ష, జంతు జాతులను సెట్స్ జాబితాలో చేర్చడం వల్ల  అంతర్జాతీయంగా వాణిజ్యం చేయడానికి అవరోధం ఏర్పడిందని కేంద్రమంత్రి వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement