Sunday, April 28, 2024

Red Alert | తెలంగాణాకు రెడ్‌ అలెర్ట్‌.. మూడు రోజులపాటు అతిభారీ వర్షాల కురిసే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : మొన్నటివరకు దండికొట్టిన అతిభారీ వర్షాలు ఒకరోజు ఊపిరి పీల్చుకునన్‌ అన్తరం మళ్ళీ మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సోమవారం తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ.. తాజాగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముందస్తు అంచనాల ప్రకారం మంగళవారం రోజున హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసినట్లు తెలిపింది.

- Advertisement -

జులై 25 వ తేదీ (మంగళవారం) భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

వర్షాల కారణంగా కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు నివేదించారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందని పేర్కొంన్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్‌ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఆయా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

బీ కేర్‌ఫుల్‌ : జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు- ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. కరెంట్‌ స్తంభాల వైపు వెళ్లొద్దని పేర్కొన్నారు. నాలాలు పొంగి పొర్లే అవకాశం ఉందని సూచించారు. రోడ్లపై వాహనాలు దారులు బీ కేర్‌ ఫుల్‌గా డ్రైవింగ్‌ చేయాలన్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ఆఫీసుల నుంచి ఇళ్ల వెళ్లే వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ రెండు గంటల పాటు- వీలైంత వరకు సురక్షిత షెల్టర్లలో ఉండాలని చెప్పారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని తెలిపారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌ అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

జంట నగరాలు జలమయం

హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, యూసుఫ్‌గూడ, కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయినపల్లి, జవహర్‌నగర్‌, బేగంపేట, బొల్లారం, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, తార్నాక, ఓయూ, లాలాపేట, హబ్సీగూడలో భారీ వర్షం కురుస్తున్నది. మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, చైతన్యపురి, గుడి మల్కాపూర్‌, నాంపల్లి, మల్‌కపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్టా, లక్డీకపూల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, బషీర్‌బాగ్‌తో పాటు- పలు ప్రాంతాల్లో భారీ వాన కురుస్తున్నది. కూకట్‌పల్లి, కాచిగూడ, విద్యానగర్‌, అంబర్‌పేట, ఉప్పల్‌, ఘట్కేసర్‌, రాజేంద్రనగర్‌, గండిపేట, కోఠి, అబిడ్స్‌తో పాటు- పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

మరో వైపు ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్‌ – విజయవాడ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి హైదరాబాద్‌ వైపు రాకపోకలు నిలిచాయి. వర్షంధాటికి దారి కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షంతో డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు- చేసింది. అవసరముంటే 040-21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలని డీఆర్‌ఎఫ్‌ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి రావ్దొదని కోరింది.

ఆదాలాబాద్‌లో అత్యధిక వర్షం

అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా తాంసిలో 31.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో 4.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 3.8 మిల్లీమీటర్ల సగటు-తో వర్షాలు కురిశాయి. ప్రస్తుత సీజన్‌లో ఆదివారం వరకు 295.4 మిల్లీమీటర్లకు గాను 352.9 మిల్లీమీటర్ల వర్షపాతంతో 19 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement