Sunday, May 5, 2024

పుతిన్‌పై తిరుగుబాటు.. అనారోగ్యం నేపథ్యంలో కుట్ర.?

కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను గద్దెదించేందుకు కుట్ర జరుగుతోందని ఉక్రెయిన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌, రక్షణ వర్గాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న పుతిన్‌ను అధికారం నుంచి కూలదోసే కుట్ర ఇప్పటికే ప్రారంభమైందని వారు బాంబు పేల్చారు. ఇక పుతిన్‌ అధ్యక్షుడిగా కొనసాగడం దాదాపు అసాధ్యమని వారు గట్టిగా చెబుతున్నారు. ఉక్రెయిన్‌ మేజర్‌ జనరల్‌ బుడనవ్‌ ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి యుద్ధం ముగుస్తుందని భావిస్తున్న ఆయన రష్యా అధ్యక్ష పీఠం నుంచి పడదోసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ మేజర్‌ జనరల్‌ బుడనోవ్‌ మాట్లాడుతూ ఆగస్టు మధ్యవారానికి యుద్ధం కీలక దశకు చేరుకుంటుందని, ఈ యుద్ధంలో రష్యా ఓటమిపాలైన మరుక్షణం పుతిన్‌ను గద్దెనుంచి దింపేస్తారని, రష్యా పతనం తప్పదని అభిప్రాయపడ్డారు. క్రెవ్లిున్‌ అధిపతి పుతిన్‌కు కేన్సర్‌ సహా అనేక అనారోగ్య సమస్యలున్నాయని గుర్తు చేసిన బుడనోవ్‌, ఈ విషయంలో తానేమీ కట్టుకథలు చెప్పడం లేదని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నదన్న ఆయన ఒకప్పటిలా రష్యా బలీయమైన శక్తి కానేకాదని అన్నారు. పుతిన్‌ అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయనకు సంబంధించిన కార్యకలాపాలను క్రెవ్లిున్‌ గుట్టుగా ఉంచుతోందని, బహిరంగ వేదికలపైకి పుతిన్‌ రాకుండా జాగ్రత్తపడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. విదేశీ నేతల భేటీలకు సంబంధించిన దృశ్యాలను పరిమితంగానే విడుదల చేస్తోందని, ఆ భేటీల్లో పుతిన్‌ ఎక్కువ సేపు పాల్గొనకుండా చూస్తోందని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా యుద్ధం ముగుస్తుందని, ఇప్పటికే కీవ్‌, ఖార్కీవ్‌ ప్రాంతాల్లో రష్యా దళాలు తీవ్రంగా నష్టపోయి వెనక్కు మళ్లాయని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో పుతిన్‌ సేనకు పరాభవం తప్పదని, రష్యాను ఐరోపా సమాజం ఓ ముప్పుగా చూస్తోందని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement