Thursday, May 2, 2024

తెలంగాణ‌ విద్యుత్ రంగంలో వేగవంతమైన మార్పు : రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో రెన్యూయెబుల్ ఎనర్జీ సామర్థ్యం పెంపుపై తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో సోమవారం ఇన్వెస్ట్‌మెంట్ బజార్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్, విద్యుత్ రంగ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, పరికరాల తయారీదారులు, పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రైవేట్ అధికారులు అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రంగ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టే ప్రాజెక్టులకు మంచి ఫైనాన్షియల్ సదుపాయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సామర్థ్య పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా విద్యుత్ రంగంలో వేగవంతమైన మార్పు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్ లో రాబోయే విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారమని ఆయన చెప్పారు. తెలంగాణ రెడ్కో.. విద్యుత్ వినియోగం లేని భవనాన్ని 2591 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబోతోందని చెప్పారు. ఇది మొట్టమొదటి పర్యావరణ అనుకూల భవనమని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 70 మెగావాట్లుగా ఉండేదని.. ఇప్పుడు అది 5400 మెగావాట్లకు పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కృషి, విద్యుత్ ఉత్పత్తి, పొదుపులో స్థిరమైన పద్ధతుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ జాయింట్ డైరెక్టర్ శ్యాంసుందర్ , పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజర్ పీయూష్ దత్ పాండే, తెలంగాణ రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ ఎన్.జానయ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement