Saturday, April 27, 2024

Delhi: దీర్ఘకాలిక లీజుపై రైల్వే స్థలాలు.. దేశవ్యాప్తంగా 300 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు: కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంతో పాటు రైల్వే ఆదాయాన్ని మరింత పెంచడానికి దోహదపడేలా కేంద్ర మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రైల్వే భూ విధానాన్ని మార్చాలన్న ఆ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన మంత్రి గతి శక్తి ఫ్రేమ్‌వర్క్ అమలు కోసం రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానాన్ని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా రైల్వేకు మరింత రాబడితో పాటు దాదాపు 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా 300 చోట్ల పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లను ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా నిర్మించనున్నారు. ఫలితంగా రైల్వే మరింత కార్గోను ఆకర్షించడంలో, సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంలో ఈ టెర్మినళ్లు దోహదపడతాయి. తక్కువ ఖర్చుతో కూడుతున్న రైల్వే సరకు రవాణా ద్వారా దేశంలో వివిధ వస్తువుల ధరలు సైతం తగ్గే అవకాశం ఉంది.

పీఎం గతి శక్తి ప్రోగ్రామ్‌లో యుటిలిటీల కోసం అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇది విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, టెలికాం కేబుల్, మురుగునీటి నిర్మూలన, డ్రైనేజీలు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, పైప్‌లైన్‌లు, రోడ్లు, ఫ్లైఓవర్‌లు, టెర్మినల్స్, ప్రాంతీయ రైలు రవాణా, పట్టణ రవాణా మొదలైన ప్రజా ప్రయోజనాల అభివృద్ధికి సహాయపడుతుంది. ల్యాండ్ లీజింగ్ విధానాన్ని సరళీకరించడం వల్ల అన్ని సరకు రవాణాతో ముడిపడ్డవారు కార్గో సంబంధిత సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి, రైల్వేలకు అదనపు కార్గో ట్రాఫిక్, సరకు రవాణా ఆదాయంలో వారి భాగస్వామ్యాన్ని అందించడానికి మార్గం సుగమం అవుతుంది. కార్గో టెర్మినళ్ల నిర్మాణం సులభంగా చేపట్టడానికి వీలవుతుంది.

ఏడాదికి భూమి మార్కెట్ విలువలో 1.5% ధరతో 35 సంవత్సరాల వరకు కార్గో సంబంధిత కార్యకలాపాల కోసం రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు పొందే అవకాశం కలుగుతుంది. కార్గో టెర్మినల్స్ కోసం రైల్వే భూమిని ఉపయోగిస్తున్న ప్రస్తుత సంస్థలు పారదర్శక, పోటీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత కొత్త పాలసీకు మారే అవకాశం ఉంటుంది. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 300 పీఎం గతి శక్తి కార్గో టెర్మినళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే రైల్వే స్థలాల్లో నామమాత్రపు ఖర్చుతో సోలార్ విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కూడా వీలవుతుంది. ఇదే పద్ధతిలో రైల్వే స్థలాల్లో కేంద్రీయ విద్యాలయాలు, ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement