Friday, April 26, 2024

రైతు బంధు పథకంపై ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంపై విప్లవ సినిమాల నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. రైతు బంధు పథకం చాలా అద్భుతమైనదని ఆయన కితాబునిచ్చారు. ఈ పథకానికి నాంది పలికిన సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిచారని కొనియడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలు రైతులకు వరాలు కావని… అన్నదాతల పాలిట శాపాలని మండిపడ్డారు. 8 నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతుంటే… రైతు మాత్రం ధైర్యంగా వ్యవసాయం చేసి అందరికీ ఆహారాన్ని అందించాడన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం పక్కన పెట్టాలని… స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గత 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందిస్తున్నట్టుగానే… సినిమాల ద్వారా తాను కూడా స్పందిస్తున్నానని నారాయణమూర్తి చెప్పారు. ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ నుంచి ‘సుఖీభవ’ వరకు 36 సినిమాలను తాను తీశానని తెలిపారు. తన 37వ సినిమా ‘రైతన్న’ ఈ నెల 14న విడుదలవుతుందని చెప్పారు. తమ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.

మరోవైపు విప్లవ సినిమాల నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన ‘రైతన్న’ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజలను కోరారు. చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు తీసే ఏకైక నటుడు ఆర్.నారాయణమూర్తి అని కొనియాడారు. రైతుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ‘రైతన్న’ సినిమాను నిర్మించారని, ప్రజలకు మంచి చేసే చిత్రాలను అందరూ ఆదరించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో దారుణం… యువకుడిని కొట్టి చంపిన ఏపీ డీజీపీ గన్‌మెన్

Advertisement

తాజా వార్తలు

Advertisement