Saturday, May 4, 2024

పీవీఆర్‌, ఐనాక్స్‌.. మెగా విలీనం… మల్టిప్లెక్స్‌ వ్యాపారం విస్తరణ.. ఎండీగా అజయ్‌ బిజ్లీ

న్యూఢిల్లి : పీవీఆర్‌, ఐనాక్స్‌ అనగానే గుర్తుకొచ్చేవి భారీ మల్టిప్లెక్స్‌ సంస్థలు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. రెండు కంపెనీలు ఆదివారం ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించాయి. మల్టిప్లెక్స్‌ వ్యాపార సంస్థలైన పీవీఆర్‌, ఐనాక్స్‌లు విలీనం అయ్యేందుకు నిర్ణయించుకున్నాయి. అయితే ఈ కీలక ఒప్పందం నేపథ్యంలో.. బాధ్యతల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పీవీఆర్‌కు సీఎండీగా వ్యవహరిస్తున్న అజయ్‌ బిజ్లీ.. ఇక మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఈ మేరకు ఇరు కంపెనీల బోర్డులు కూడా ఆమోదం తెలిపినట్టు వివరించాయి. పీవీఆర్‌ సంస్థకు చెందిన మరో కీలక వ్యక్తి.. సంజీవ్‌ కుమార్‌, ఉమ్మడి సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఐనాక్స్‌ గ్రూప్‌ చైర్మన్‌గా సేవలు అందించిన పవన్‌ కుమార్‌ జైన్‌.. ఉమ్మడి సంస్థ బోర్డు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, సిద్దార్థ్‌ జైన్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఈ మేరకు ఎక్స్ఛేంజీలో కూడా ఇరు సంస్థలు ఈ కీలక విషయాలు నివేదించాయి. ఓటీటీ కారణంగానే.. రెండు సంస్థలు ఏకమవుతున్నట్టు తెలుస్తున్నది.

బాక్సాఫీజు ఆదాయంలో 50శాతం వాటా..

పీవీర్‌, ఐనాక్స్‌ కలిసిపోతే.. ఏం పేరు పెడ్తారనే అనుమానం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇక పీవీఆర్‌, ఐనాక్స్‌ కాస్త.. పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్స్‌గా పిలువబడుతాయి. భారతీయ మల్టిdప్లెక్స్‌ రంగంలో ఎక్కువగా వినిపించే పేర్లు.. పీవీఆర్‌, ఐనాక్స్‌ మాత్రమే. అయితే బోర్డు మాత్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నా.. ఈ డీల్‌కు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, సెబీ, సీసీఐ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ అందాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా షేర్ల రూపంలో జరిగిన ఈ ఒప్పందానికి ఇంకా పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్‌ హోల్డర్ల ఆమోదం కూడా లభించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సంస్థలు ఆమోదిస్తేనే.. ఐనాక్స్‌, పీవీఆర్‌లు విలీనమై.. పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌గా ఆవిర్భవిస్తుంది. అయితే ఐనాక్స్‌ షేర్లు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పీవీర్‌ షేర్లు కూడా లభించనున్నాయి. మల్టిdప్లెక్స్‌ వరకు మాత్రమే చూసుకుంటే.. పీవీఆర్‌ ప్లస్‌ ఐనాక్స్‌, సినీ పొలిస్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.

341 ప్రాంతాల్లో, 1546 తెరలపై సేవలు..

దేశ వ్యాప్తంగా పీవీఆర్‌, ఐనాక్స్‌లకు ఉన్న మల్టిdప్లెక్స్‌ల పరంగా చూసుకుంటే.. పీవీఆర్‌కు 73 పట్టణాల్లో 181 ప్రాంతాల్లో 871 థియేటర్లు ఉన్నాయి. ఇక ఐనాక్స్‌కు 72 పట్టణాల్లో.. 160 ప్రాంతాల్లో.. 675 సినిమా థియేటర్లు ఉన్నాయి. వాటాల పరంగా చూసుకుంటే.. కొత్తగా ఏర్పడే పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌లో పీవీఆర్‌ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్‌ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. ఇక దేశ వ్యాప్తంగా రెండు మల్టిdప్లెక్స్‌ సంస్థలు కలిస్తే.. సేవలు ఓ రేంజ్‌లో ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు సంస్థలు ఏకమైన తరువాత.. దేశ వ్యాప్తంగా 109 పట్టణాల్లో.. 341 ప్రాంతాల్లో 1,546 థియేటర్లు ఉంటాయి.

- Advertisement -

పెరగనున్న కన్వినియన్స్‌ ఫీజు..

రెండు సంస్థలు కలిసిపోతే.. సదరు ఉమ్మడి సంస్థకు భారత్‌ మల్టిప్లెక్స్‌ విభాగంలో 50శాతం వాటా లభించనున్నట్టు తెలుస్తున్నది. పీవీఆర్‌కు ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతంలో బలమైన నెట్‌వర్క్‌ ఉంది. ఐనాక్స్‌కు తూర్పు ప్రాంతంలో అధిక సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు బాక్సాఫీసు ఆదాయంలో 42 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక రెండు సంస్థలు కలిస్తే.. ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఈ సందర్భంగా ఎలారా క్యాపిటల్‌ ఉపాధ్యక్షుడు కరణ్‌ మాట్లాడుతూ.. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి ఒక్కో తెరకు ఐనాక్స్‌కు వచ్చే ప్రకటనల ఆదాయం పీవీఆర్‌తో పోలిస్తే.. 33 శాతం తక్కువన్నారు. రెండు సంస్థలు కలిస్తే.. ఐనాక్స్‌ తెరల ప్రకటనల ఆదాయం కూడా పీవీఆర్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. కన్వినెన్స్‌ ఫీజు విషయంలోనూ పీవీఆర్‌తో పోలిస్తే.. ఐనాక్స్‌కు చాలా తక్కువ ఆదాయం వస్తోందని వివరించారు. అయితే రెండు సంస్థలు కలిసిపోతే.. కన్వినియెన్స్‌ ఫీజు భారీగా పెంచుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. ఎబిట్‌డా ఆదాయం రూ.150 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఓటీటీ వైపు నిర్మాతల పరుగు..

కరోనా సమయంలో.. దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థికంగా కుదేలయ్యాయి. ఎప్పుడు థియేటర్లు మూతపడుతాయో తెలియని పరిస్థితులు. ఈ సెగ పీవీఆర్‌, ఐనాక్స్‌ను కూడా తాకాయి. సినీ నిర్మాతలు థియేటర్లు వదిలేసి.. అమెజాన్‌ ప్రైం, నెట్‌ఫ్లిక్స్‌, డిస్ని ప్లస్‌ హాట్‌స్టార్‌ వైపు పరుగులుపెట్టారు. అదే స్థాయిలో ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీగా మొత్తంలోనే డబ్బులను చెల్లిస్తుండటం మల్టిప్లెక్సులకు మైనస్‌ అయ్యింది. మల్టిప్లెక్స్‌లో వెళ్లి సినిమా చూడటం ఖర్చుతో కూడుకున్న పనిగా భావించిన చాలా మంది ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్‌తో అవసరం వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి సినిమాలు చూడటం ప్రారంభించారు. దీంతో థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొంత మంది థియేటర్లను మూసివేయగా.. మరికొంత మంది పెళ్లిళ్లకు అద్దెకు ఇస్తూ మెయింటెనెన్స్‌ చేసుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే రెండు మల్టిdప్లెక్సులు ఏకమైనట్టు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement