Saturday, April 27, 2024

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ పనితీరు వేస్ట్​, గ్రూప్‌-1 ఎంపికలో అవకతవకలు.. జగన్​కు చంద్రబాబు లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ : నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వీర్యమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సోమవారం ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురు చూస్తుందని పేర్కొన్నారు. పబ్లిక సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ – 1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో గడిచిన మూడు సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు యువతను తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురి చేస్తుంద న్నారు. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌ – 1 ఉద్యోగాలకు 2019 డిసెంబర్‌లో వ్రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలను గత ఏడాది మేలో ప్రకటించారని పేర్కొన్నారు.

గ్రూప్‌ – 1 మెయిన్స్‌ ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వెల్లడించారు. మెయిన్స్‌ పరీక్ష తేదీలను ఐదుసార్లు మార్చారని పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుల తడకగా సాగిందని ఆరోపించారు. నచ్చిన వారిని ఎంపిక చేసేందుకు సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు, కార్యదర్శి నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారన్నారని తెలిపారు. మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు, రెండోసారి విడుదల చేసిన వాటికి భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారని తెలిపారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని చంద్రబాబు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గతంలో గ్రామ సచివాలయాల ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్లుగా అభ్యర్థులు ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement