Tuesday, May 21, 2024

పర్యాటకాభివృద్ధితో పురోగతి.. తొలిసారి టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచంలో ఏ దేశానికీ లేనన్ని రకాల పర్యాటక (సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక, హరిత, వెల్ నెస్, వ్యవసాయ పర్యాటకం) అనువైన రంగాలు భారతదేశానికి ఉన్నాయని, అదే మన ప్రధాన బలమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సమీప భవిష్యత్తులో భారత్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా దేశంలో పర్యాటక  రంగాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, దాని ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణను ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. మొదటిసారి టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో మే 17 నుంచి 19 వరకు జరగనున్న పర్యాటక సదస్సు లోగో టీజర్‌ను ఆయన ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యాటక రంగ అభివృద్ధి, ఆ రంగంలో పెట్టుబడులు వంటి అంశాలపై టూరిజం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

- Advertisement -

ఆయా ప్రాంతాల్లోని వనరులను సద్వినియోగ పరుచుకుని అవసరమైన మౌలిక వసతుల కల్పన, అనుసంధానతను పెంచడం ఇప్పుడు అవసరమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ ‘వికాస్ భీ ఔర్ విరాసత్ భీ’ నినాదాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దీని ఫలితంగానే దేశంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI) ర్యాంకింగ్స్ లో 20వ స్థానానికి, కల్చరల్ రిసోర్సెస్ ర్యాంకింగ్స్ లో 12వ  స్థానానికి, నేచురల్ రిసోర్సెస్ లో 6వ స్థానానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.

దేశీయ పర్యాటకం కూడా ఊపందుకుందని.. జమ్మూకశ్మీర్ లో 2022లో 1.84కోట్ల మంది దేశీయ పర్యాటకులు రావడం ఇందుకు నిదర్శనమని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీనగర్, లేహ్ విమానాశ్రయాలకు విమానాల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగాయన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నెలకొంటున్న శాంతి కారణంగానే జమ్మూకశ్మీర్‌లో డొమెస్టిక్ టూరిజం పెరుగుతోందని ఆయన చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి చేపడుతున్న స్వదేశ్ దర్శన్, ప్రసాద్, దేఖో అప్నాదేశ్ వంటి పథకాలతో పాటు డిజిటలైజేషన్, పర్యాటక, ఆతిథ్య రంగ భాగస్వామ్య పక్షాలను కలుపుకుని పనిచేస్తూ ముందుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సంపూర్ణ సమన్వయంతో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని కూడా కేంద్రమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి రాకేశ్ వర్మ, శాఖ ఆర్థిక సలహాదారు జ్ఞాన్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement