Saturday, May 11, 2024

ఇండిగోకు లాభాలు.. పైలట్లకు వేతనాలు పెంపు

దేశంలో విమాన ప్రయాణాలు కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. విమానయాన సంస్థలు ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సహకాలను పునరుద్ధరిస్తున్నాయి. ఇండిగో పైలట్ల వేతనాల్లో వార్షిక పెంపు ప్రక్రియను పునరుద్ధరించినట్లు తెలిపింది. ఏప్రిల్‌ నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఉద్యోగులకు ఇ-మెయిన్‌ ద్వారా తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో విమానయాన సంస్థలన్నీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీని వల్ల ఉద్యోగులకు ఇచ్చే అనేక రకాల ప్రోత్సహకాలను రద్దు చేశాయి. వేతనాల్లోనూ కోతలు విధించాయి. ప్రస్తుతం దేశీయ విమానయాన ప్రయాణాలు పూర్తిగా కోవిడ్‌ కంటే ముందుస్థాయికి చేరుకున్నాయి. విమానయాన సంస్థల ఆదాయాలు పెరుగుతున్నాయి. దీంతో గతంలో రద్దు చేసిన ప్రోత్సహకాలను పునరుద్దరిస్తున్నాయి.

- Advertisement -

ఏటీఆర్‌ విమానాలను నడిపే పైలట్ల వేతనాలను కూడా పెంచే యోచనలో ఉన్నట్లు ఇండిగో ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ విభాగపు ఉపాధ్యక్షుడు అశీమ్‌ మిత్ర తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుందని తెలిపారు. ఎయిర్‌బస్‌ పైలట్లతో పోల్చితే ఏటీఆర్‌ విమానాల పైలట్ల వేతనాలు తక్కువగా ఉంటాయి. ఇండిగో ఇప్పటికే పైలట్ల వేతనాలను కరోనా ముందున్న స్థాయికి పెంచింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇండిగో 1,422 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఆదాయం 60.7 శాతం పెరిగి 14,933 కోట్లకు చేరింది. అంతకు ముందు వరసగా మూడు త్రైమాసికాల్లో ఇండిగో నష్టాలు ఎదుర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement