Saturday, May 4, 2024

రైల్వేను వ్యాపారంలా చూడొద్దు, సేవలా భావించండి.. కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ లావు శ్రీకృష్ణ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన రైల్వే హామీలను నెరవేర్చవలసినదిగా వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హామీలను నెరవేర్చాల్సిందిగా గత 9 ఏళ్లుగా కోరుతున్నప్పటికీ కేంద్ర తాత్సారం చేస్తూనే ఉందని అన్నారు. సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. సౌత్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ నిర్మాణం జరగలేదని, కనీసం ఒక్క భవంతి కూడా పూర్తికాలేదని అన్నారు. ఏపీ యువత ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు వైజాగ్‌లో రైల్వే రెక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గతేడాది బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు కేటాయించినట్టుగా చెప్పారని, అలాగే ఈ ఏడాది రూ. 8,400 కోట్లు కేటాయించామని చెబుతున్నప్పటికీ వాటిని ఖర్చు చేసి అభివృద్ధి చేయాలని ఎంపీ లావు అన్నారు.

కొత్త రైల్వే లైన్ల నిర్మాణ ఒప్పందాలు 2014కి ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో చేసుకుందని, కానీ అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే నిర్మాణాలకు రాష్ట్రం స్థలాలు కేటాయించలేదని సాకులు చెబుతున్నారని ఆరోపించారు. స్థలాలు కేటాయించిఅన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకుందని, కానీ నిధుల విషయంలో రాష్ట్రం ఇబ్బందిపడుతోందని తెలిపారు.  2014కి ముందు రాష్ట్ర ఆదాయం బాగా ఉండేదని, విభజన తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఏర్పడినందున ఒప్పందాలు సడలించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ఝార్ఖండ్, బీహార్‌ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వాటాను తగ్గించిన ఉదంతాలను లావు గుర్తుచేశారు. ఏపీలో నడికుడి – శ్రీకాళహస్తి కొత్త రైలుమార్గం నిర్మాణం జరగలేదని తెలిపారు. రైల్వే వ్యవస్థను కేంద్రం ఒక వ్యాపారంలా కాకుండా ప్రజా సేవగా చూడాలని సూచించారు. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో గతంలో 17 రైళ్లు ఆగేవని, కానీ ఇప్పుడు కేవలం 7 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని తెలిపారు. వందేభారత్‌ వంటి రైళ్లు, అందులోని ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని, వీటి దృష్ట్యా కేంద్రం గతంలో మాదిరిగా అన్ని స్టేషన్లలో రైళ్లు అగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement